calender_icon.png 4 March, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకొక ఎమ్మెల్సీ సీటివ్వండి!

04-03-2025 01:58:53 AM

కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షాల ఒత్తిడి 

పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సీపీఐ ప్రతినిధుల బృందం భేటీ

హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీపై మిత్రపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఈమేరకు సీపీఐ రాష్ర్ట నేతల బృందం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సోమవారం గాంధీభవన్‌లో కలిసింది.

సీపీఐ రాష్ర్ట కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ సీనియర్ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, పల్లె నర్సింహ తదితరులు పీసీసీ చీఫ్‌ను కలిసి.. తమ పార్టీ నుంచి ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌కు మరో మిత్రపక్షమై న టీజేఎస్ కూడా ఎమ్మెల్సీ సీటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఆ పార్టీ అధినేత కోదండ రామ్‌కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే  ఎన్నికల ముందు ఒప్పందంలో భాగంగా మరో ఎమ్మెల్సీ, నామినే టెడ్ పదవులు కోరాలని టీజేఎస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. కొంతకాలంగా చాలా విషయాల్లో ఎంఐఎం, కాంగ్రెస్ ఏకాభిప్రాయంతో వెళ్తున్నాయి.  ఒక స్థానం ఎం ఐఎంకు కేటాయించే ఆలోచన సైతం గాంధీభవన్ వర్గాల నుంచి వినిపి స్తోంది.

ఒప్పందం ప్రకారం మాకు రెండు ఎమ్మెల్సీలు ఇవ్వాలి: కూనంనేని

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో భేటీ అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒప్పందం లో భాగంగా తమ పార్టీకి రెండు ఎమ్మెల్సీలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఇప్పుడు ఒకటి ఇవ్వాలని, తర్వాత మరో ఎమ్మెల్సీ పదవీ ఇవ్వాలని కూనంనేని డిమాండ్ చేశారు.