calender_icon.png 3 April, 2025 | 6:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రివర్గంలో మాకూ చోటివ్వండి

27-03-2025 01:48:02 AM

  1. క్యాబినెట్ కూర్పుకు పెరుగుతున్న సామాజిక డిమాండ్  
  2. అధిష్ఠాన పెద్దలను కలిసి విన్నపాలు
  3. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మాదిగ, లంబాడ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటించాలనే డిమాండ్ పెరుగుతోంది. క్యాబినెట్‌లో చోటు లేనివారికి అవకాశం కల్పించాలని ఆయా సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రధానంగా ఎస్సీల నుంచి మాదిగ, ఎస్టీల నుంచి లంబాడ సామాజికవర్గం వినతులు అందుతున్నాయి.

మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు లేఖ రాశారు. మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఉన్నారని , మాదిగలకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పెద్దలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

బుధవారం మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేల్, తోట లక్ష్మికాంతారావు, కాలే యాదయ్య బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని అసెంబ్లీలోని వారి చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. మాదిగలకు మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలని కోరారు.

ఆ తర్వాత లంబాడ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బాలు నాయక్, రామచంద్రనాయక్, మాలోత్ రాందాస్ నాయక్ తదిత రులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి లంబాడ సామాజికవర్గానికి  మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఎస్టీ కోటాలో ఆదివాసీ సామాజికవర్గం నుంచి సీతక్క మంత్రిగా ఉన్నారు. మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలనే అంశంపై ఢిల్లీకి వెళ్లి పార్టీపెద్దలను కలుస్తామని ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు.