calender_icon.png 18 January, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

70 వేల కోట్లివ్వండి

11-09-2024 03:15:51 AM

16వ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం వినతి

రాష్ట్రానికి ఇప్పుడు రుణాలు, వడ్డీలే సవాళ్లు

పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలి

సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడి

ప్రజాభవన్‌లో ఆర్థిక సంఘంతో భేటీ

జీడీపీ ఆధారంగా నిధులివ్వాలి: భట్టి

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించేం దుకు కేంద్రం నుంచి రూ.౭౦ వేల కోట్లు వచ్చేలా సిఫారసు చేయాలని ౧౬వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర పథకాలకు నిధులు వచ్చేలా చూడాలని కోరింది.

మంగళవారం 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పణగరియా అధ్యక్షతన, సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, అనీ మాథ్యూస్, డాక్టర్ మనోజ్ పండా, డాక్టర్ సౌమ్యా కాంతి ఘోష్ సమక్షంలో ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిపూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్థిక, ఎంఏ అండ్ యూడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కలిసి రాష్ట్రానికి కేంద్రం నుంచి కావాల్సిన నిధులు, తెలంగాణ ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ఫైనాన్స్ కమిషన్ సభ్యులకు ప్రత్యేకంగా వివరించారు. 

అప్పులే అతిపెద్ద సవాల్

బలమైన ఆర్థిక పునాదులు ఉన్నప్పటికీ తెలంగాణ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి భారీ రుణం సవాల్‌గా మారిందని చెప్పారు. గత పదేళ్లు పాలించిన సర్కారు విపరీతమైన అప్పులను తమపై మోపిందని, రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం అప్పులు, వడ్డీలకే పోతోందని వెల్లడించారు. ఈ సవాళ్లను అధిగమించడానికి 16వ ఆర్థిక సంఘం సిఫారసులు ఉపయోగపడతాయని సీఎం విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించేలా తగినంత సహాయం అందించాలని కోరారు. తెలంగాణకు సవాలుగా మారిన రుణ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్రానికి మద్దతుగా నిలువాలని విన్నవించారు.

గత ఆర్థిక సంవత్సరం చివరినాటికి తెలంగాణ రుణభారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుందని, ఇందులో బడ్జెట్ రుణాలతోపాటు ఆఫ్ -బడ్జెట్ రుణాలూ ఉన్నాయని కమిషన్ సభ్యులకు వివరించారు. గత పదేళ్లలో మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని, ఆ రుణాలను తీర్చే బాధ్యత తమపై పడిందని చెప్పుకొచ్చారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించకపోతే ఆ ప్రభావం రాష్ర్ట పురోగతిపై చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. రుణాలను రీస్ట్రక్చర్ చేసే అవకాశం కల్పించాలని, లేకుంటే అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు.

పన్నుల్లో వాటాను పెంచాలి

కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచేలా కేంద్రానికి సిఫారసు చేయాలని సీఎం సూచించారు. ఈ డిమాండ్ అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నందన సానుకూలంగా స్పందించాలని కోరారు. దేశంలోనే తెలంగాణ యువ రాష్ట్రమని, తమ రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని అన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ర్టం తమదని, దేశాభివృద్ధిలోనూ తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి సంపూర్ణంగా సహకరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తెలంగాణ తరఫున తమ వంతు కృషి చేస్తామని వివరించారు. తెలంగాణ ఆర్థిక నిర్వహణను బలోపేతం చేయడానికి కేంద్ర మద్దుతు కోరుతున్నామని కమిషన్ సభ్యులకు సీఎం తెలిపారు. 

జీడీపీ ప్రాదిపాదికన నిధులివ్వాలి

రాబోయే రోజుల్లో రాష్ట్రం అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం నిధులను విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వివిధ ప్రాంతాల మధ్య విపరీతమైన ఆర్థిక అసమానతలు ఉన్న నేపథ్యంలో తలసరి ఆదాయం ప్రాతిపాదికన కేంద్రం నిధులను ఇవ్వొద్దని, అలా చేయడం వల్లే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని, జీడీపీ ప్రాతిపాదిక నిధులు ఇవ్వడం ద్వారా తెలంగాణకు వచ్చే వాటా పెరుగుతుందని 16వ ఫైనాన్స్ కమిషన్‌కు వివరించినట్లు భట్టి వెల్లడించారు.

ఫైనాన్స్ కమిషన్‌తో సమావేశం అనంతరం ప్రజాభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. కేంద్ర ప్రాయోజిత పథకాల (ఎస్‌ఎస్‌సీ) నిధుల వినియోగం దేశం మొత్తం ఒకే విధంగా ఉంటున్నాయని, దాని వల్ల తెలంగాణ లాంటి కొన్ని రాష్ట్రాలు నష్టపోతున్నాయని చెప్పారు. రాష్ట్రాలు తమకు అవసరమైన స్కీమ్‌ను రూపొందించుకొని దానికి ఎస్‌ఎస్‌సీ నిధులను వినియోగించుకునేలా కేంద్రం వెలుసుబాటు కల్పించేలా సిఫారసు చేయాలని కమిషన్‌ను కోరినట్లు భట్టి చెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కమిషన్‌కు వివరించినట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ నిధులను గత ప్రభుత్వం వినియోగించుకోలేదని విమర్శించారు. వాటిని తమ సర్కారు వినియోగించుకునే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు. తెలంగాణ మొదటి ఫైనాన్స్ కమిషన్‌ను బీఆర్‌ఎస్ సర్కారు నియమించినా.. కమిషన్ సిఫారసులను నాటి ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. 

16వ కమిషన్‌కు భట్టి సూచనలు 

  1. కేంద్రం రాష్ట్రాలతో పంచుకోని సెస్‌లు, సర్‌ఛార్జీలు పెరిగాయి. వాటిని వేరుగా ఇవ్వడం ద్వారా తెలంగాణకు నష్టం జరుగుతుంది. సెస్‌లు, సర్‌ఛార్జీలను కూడా పన్నుల వాటా ఎంత ఉంటే అంత ఇవ్వాలి. 
  2. తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ.. సంపద, ఆదాయ పంపిణీలో భారీ అంతరం ఉంది. అసమానతల కారణంగానే ఈ ప్రాంతం గతంలో ఉద్యమాలు వచ్చాయి. అసమానతలను పరిష్కరించే విషయంలో మౌలిక సదుపాయాలు, సంక్షేమంపై గణనీయమైన డబ్బును ఖర్చు చేయవలసి ఉంటుంది. దానికి కేంద్రం సహకారం కావాలి.
  3. రైతు భరోసా, వ్యవసాయ రుణాల మాఫీ, ఆహార సబ్సిడీ వంటి కార్యక్రమాలు మన బలహీన వర్గాలకు ఆర్థిక స్థిరత్వం, సామాజిక భద్రతను కలిగిస్తాయి. ఈ కార్యక్రమాలను ప్రజా సంక్షేమానికి అవసరమైన పెట్టుబడులుగా గుర్తించాలి.
  4. పాఠశాలల బలోపేతానికి నిధులివ్వాలి.
  5. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలి.
  6. గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏటా వడ్డీ లేని రుణా లు రూ.20 వేల కోట్లు అందిస్తున్నాం. ఈ కార్యక్రమానికి చేయూతనందించాలి. 
  7. నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ యూని వర్సిటీని ప్రభుత్వం ప్రారంభించింది. టాటా కంపెనీ సహకారంతో 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నాం. వీటి బలోపేతానికి కేంద్రం ఇతోదికంగా సాయపడాలి.
  8. మూసీ రివర్ పునరుద్ధరణ, ఆర్‌ఆర్‌ఆర్, మౌలిక సదుపాయాల కల్పన, ఏఐ వంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. దీనికి కేంద్రం నిధులు ఇవ్వాలి.
  9. ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందిస్తున్నాం. హెల్త్ కార్డులు డిజిటలైజేషన్ చేపడుతున్నాం. ప్రజారోగ్యం కోసం చేపట్టే ప్రోగ్రామ్స్ విషయంలో రాష్ట్రాన్ని కేంద్రం ప్రోత్సహించాలి. 

కమిషన్ సభ్యులకు విందు, సన్మానం

ప్రజాభవన్‌లో సమావేశం సందర్భంగా 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, సభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, సీఎస్ శాంతి కుమారి సత్కరించారు. సమావేశం ముగిసిన అనంతరం వారికి విందును ఏర్పాటు చేశారు. విందు అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌ను సచివాలయానికి వెళ్లారు.