* జేఎన్‌టీయూ, ఏఐసీటీఈలకు హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, జనవరి 29, (విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎస్వీఐటీ కాలేజీకి చెందిన వివరాలను సవరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని జేఎన్‌టీ యూ, ఏఐసీటీఈలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాలేజీకి చెందిన ఈమెయిల్‌తో సహా ఇతర వివరాలను సవరించుకోవడానికి అవకాశం లేకుండా లాక్ చేయడంపై విద్యాసంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ చేపట్టారు. అనంతరం వివరాలు సవరించడానికి ఎస్వీఐటీ సమర్పించిన వినతి పత్రంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాల సవ రణకు చివరి తేదీ ఫిబ్రవరి కావడంతో జనవరి 30లోగా కాలేజీకి అవకాశం కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం విద్యార్థుల ప్రయోజనాల కోసమే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది.