30-04-2025 12:00:00 AM
తహసీల్దార్‌కి సిరసనగండ్ల గ్రామస్తుల వినతి
చారకొండ ఏప్రిల్ 29 : మండలంలోని శిరుసనగండ్ల గ్రామ పరిధిలో బ్లాక్ గ్రానైట్ తీసేందుకు మంగళవారం ప్రతిపాదిత ప్రాంతంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వ ర్యంలో పర్యావరణ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, ఆర్డీవో శ్రీనివాసు, తహసిల్దార్ సునీత సమక్షంలో పర్యావరణ అనుమతుల కోసం పర్యటించారు. సిరిసినగండ్ల గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 182 లో 7.70 హెక్టార్లలో బ్లాక్ గ్రానైట్ తీయుటకు ఎండి అజీమొద్దీన్ కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని పర్యావరణ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు తెలిపారు.
మైనింగ్ పై పర్యావరణ ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి సమావేశం నిర్వహించామన్నారు. సమావేశంలో గ్రామస్తులు, ఇతర ప్రతినిధులు 17 మంది అభిప్రాయాలను తెలపగా, 14 మంది వ్రాతపూర్వకంగా తమ అభిప్రాలను తమ కార్యాలయానికి అందజేశారని తెలిపారు. అభిప్రాయ సేకరణలను కాలుష్య ని యంత్రణ మండలికి పంపుతామన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు పసుల శ్రీను, విజయ్, సురేష్ లు మాట్లాడుతూ మైనింగ్ పై తమకు పూర్తి స్థాయి సమాచారం, అవగాహన లేదని సమగ్ర సమాచారంతో అవగాహన కల్పించిన తర్వాతనే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని కోరారు.
182 సర్వే నెంబర్ లో అత్యధికంగా దళితులకే భూములు ఉన్నాయని, మైనింగ్ చేస్తే సమీపంలోని భూముల్లో పంటలు పండే పరిస్థితి ఉండదని, దీంతో దళిత కుటుంబాలకు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ప్రభుత్వం తమకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు.
తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసిన గ్రామస్తులు.
గ్రామస్థులు లేకుండానే కాంట్రాక్టర్ కు అనుకూలంగా ఉన్న బయటి వ్యక్తులను తీసుకువచ్చి వారి చేత అభిప్రాయాలు చెప్పించి ఇదే ప్రజాభిప్రాయ సేకరణ అని అనడం సరికాదని, గ్రామస్తులకు అందరికీ సమాచారం ఇచ్చి గ్రామస్తుల అందరి సమక్షంలో మరో సారి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అప్పటి వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని కోరుతూ తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ సునీతకు శిరుసనగండ్ల గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.