18-03-2025 07:39:13 PM
- సమస్యను పరిష్కరించండి..
- అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్..
- ప్రజలు అడిగింది చేయకపోతే తానెందుకని ఆవేదన..
- హనుమాన్ నగర్, భూపాల్ నగర్ జలాల్ బాబా నగర్ గ్రామాలకు పట్టాలి ఇవ్వాలని విజ్ఞప్తి..
రాజేంద్రనగర్ (విజయక్రాంతి): హనుమాన్ నగర్, భూపాల్ నగర్, జలాల్ బాబా నగర్ ప్రజలకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించానాని, వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ప్రజలు అడిగింది చెయ్యడమే తన బాధ్యతని పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా ఫారెస్ట్ భూముల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్ నగర్, భూపాల్ నగర్, జలాల్ బాబా నగర్ గ్రామాల ప్రజలు ఇండ్లు నిర్మించుకొని నివాసముంటున్నారని, వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని గత ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసిఆర్ ను అడిగినట్లు పేర్కొన్నారు.
కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత ప్రజలకు ప్రతి ఎన్నికల్లో పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. నాలుగు సార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలు అడిగింది చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో నీళ్లు సరఫరా చేయాలన్నా, రోడ్లు వేయాలన్నా ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. ఇబ్బందిగా మారిన ఈ సమస్యను వెంటనే అధికారులు, మంత్రులు సమీక్షించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వమైనా ఆయా గ్రామాల ప్రజలకు పట్టాలు ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డిపైన పూర్తి విశ్వాసం ఉందని అన్నారు.