తెలంగాణ లెక్చరర్ ఫోరం రాష్ట్ర కన్వీనర్, స్వతంత్ర అభ్యర్థి పోకల నాగయ్య
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని తెలంగాణ లెక్చరర్ల ఫోరం రాష్ట్ర కన్వీనర్, స్వతంత్ర అభ్యర్థి పోకల నాగయ్య విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియాతో మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలపై గత 18 సంవత్సరాల నుండి నిరంతరం పోరాటం చేస్తున్న తను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ ఉపాధ్యాయ, అధ్యాపక, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాల మద్దతు, మేధావి వర్గం ఆలోచించి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసే వారిని ఎన్నుకోవాలన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిరుద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై, ఉపాధ్యాయ అధ్యాపక సమస్యలపై త్వరలోనే ఒక మేనిఫెస్టో రూపొందించి విడుదల చేస్తామన్నారు. నవంబర్ 23 నుండి డిసెంబర్ 9 వరకు గ్రాడ్యుయేట్స్ అందరూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజేష్ యాదవ్, టిపిటిఎఫ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఆసిఫ్, లోనారే కిరణ్, మహమ్మద్ హైమద్, అబ్దుల్ ఆహాబ్, తదితరులు పాల్గొన్నారు.