రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మార్గదర్శి ఫైనాన్సియర్స్ యాజమాన్యం చందాదాలందరికీ డిపాజిట్ల నిమిత్తం నగదు తిరిగి చెల్లించిందా? ఎగవేసిందా? అనే వివరాల సేకరణకు మూడు వేర్వేరు భాషల్లోని పత్రికల్లో నోటీసులు పబ్లిష్ చేయాలని రిజీస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తెలుగు, హిందీ, ఇంగ్లిషు పత్రికల్లో ప్రచారం జరిగేలా నోటీసులు జారీచేయాలని సూచించింది. ఇందుకయ్యే ఖర్చులను మార్గదర్శికి చెప్పి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని పేర్కొన్నది. వారంలోగా ఆ మొత్తాన్ని రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఆదేశించింది. డిపాజిట్ అయిన వెంటనే పత్రికల్లో నోటీసులు జారీ చేయాలని జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 1కి వాయిదా వేసింది. పత్రికల్లో వచ్చిన నోటీసుల కాపీలను తదుపరి విచారణ రోజు తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.