calender_icon.png 29 September, 2024 | 6:02 PM

స్థానికత ఉత్తర్వులు అందరికీ ఇవ్వండి

28-09-2024 02:22:03 AM

సుప్రీంకోర్టులో విద్యార్థుల వాదన

విచారణ 30వ తేదీకి వాయిదా  

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): నీట్ కౌన్సిలింగ్ స్థానికత వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. మెడికల్ అడ్మిషన్లకు ముందు వరసగా నాలుగేండ్లు తెలంగాణలో చదివి ఉంటనే స్థానికత వర్తిస్తుందంటూ తెలంగాణ ప్రభుత్వం జీవో 33ను జారీ చేసింది.

నీట్‌కు ముందు నాలుగేండ్లు లోకల్ గా చదవడమో స్థానికంగా ఉండటమో చేస్తేనే స్థానికత అమలు జరుగుతుందని జీవో 33 లోని నిబంధన 3 (ఏ)ను చేర్చింది. దీనిని సవాల్ చేస్తూ హైదరాబాద్ వాసి కల్లూరి నాగనరసింహ అభిరామ్ తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. విద్యార్థులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది.

దీనిని రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత విచారణ సందర్బంగా ఒకసారి మినహాయింపు కింద హైకోర్టును ఆశ్రయించిన 135 మంది విద్యార్థులు కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

దీంతో ఈ 135 మంది కౌన్సిలింగ్ కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించడంతో పాటు, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మధ్యంతర స్టే ఆదేశాలను జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం జస్టిస్ చండ్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

హైకోర్టులో కేసు వేసిన 135 మంది విద్యార్థులకు మాత్రమే కౌన్సిలింగ్‌కు అనుమతి ఇవ్వటం అన్యాయమని విద్యార్థులు, ఇతర ప్రతివాదుల తరఫు న్యాయవాదులు వాదించా రు. దరఖాస్తు చేసుకున్న తెలంగాణ స్థానిక విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపా రు.

గత మధ్యంతర ఉత్తర్వులను విద్యా ర్థులు అందరికీ వర్తింపజేయాలని కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, గత తీర్పు ఉత్తర్వులను సవరించాలంటే ఆనాటి ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు విచారణ చేయాలని, జస్టిస్ జేబీ పార్థివాలా ప్రస్తుతం అందుబాటులో లేనందున విచారణ ఈ నెల 30వ తేదీ సోమవారం చేపడతామని ప్రకటించింది.