సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 3: ఐదురోజులుగా తమకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని, వెంటనే మిషన్ భగీరథ అధికారులు స్పందించి నీటిసరఫ రాను పునరుద్ధరించాలని నంగునూరు మండల కేంద్రంలోని నల్లపోచమ్మరోడ్డు గుట్టమీదివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం పంచాయతీ భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. కనీసం తమ ఇండ్ల మధ్య ఒక్క బోరు కూడా లేదని, ప్రతిరోజూ పొరుగు కాలనీలకు వెళ్లి నీరు తెచ్చుకోవడం ఇబ్బందికరంగా ఉందని వాపోయారు. సర్కార్ వెంటనే స్పందించి మిషన్ భగీరథ పైపులైన్లు ఏర్పాటు చేసి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): మూడు నెలలుగా తమ గ్రామానికి సక్రమంగా తాగునీరు అందడం లేదని మంగళవారం రాజాపేట మండలం బూరుగుపల్లి గ్రామస్తులు ఖాళీబిందెలతో రోడ్డెక్కి నిరసన చేపట్టారు. కనీసం తాగేందుకు కూడా నీరు ఉండటం లేదని వాపోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని, వెంటనే సమస్యను పరిష్కరించకపోతే మున్ముందు ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.