ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్ర పోలీసు ఫిర్యాదు మండలి, జిల్లా పోలీసు ఫిర్యాదు మండళ్ల ఏర్పాటు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. రాష్ట్ర పోలీసు ఫిర్యాదు మండలి, జిల్లా పోలీసు ఫిర్యాదు మండళ్లను ఏర్పాటు చేశామని, నాలుగు వారాల్లో కార్యాలయాలతో సహా ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు హామీ ఇచ్చినా అమలు చేయకపోవడంపై న్యాయవాది మామిడి వేణుమాధవ్ వ్యక్తిగత హోదాలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్ కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ వాదనలు వినిపి స్తూ.. ఫిర్యాదు మండళ్లు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని తెలిపారు. ౪ వారాల్లో సిబ్బందితో సహా కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని కోర్టుకు చెప్పినా ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.