కేంద్రమంత్రి గడ్కరీకి ఎంపీ ఈటల విన్నపం
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించి, వారిని ఆదుకోవాలని ఈటల మంత్రిని కోరారు.
రైతులు తమ భూములను కోల్పోతున్నందుకు ఎంతో ఆవేదన చెందుతున్నారని, వారికి న్యాయమైన పరిహారం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులు, బీజేపీ నేతలతో కలిసి ఈటల గడ్కరీని కలిశారు.
స్వచ్ఛ భారత్ నిధులను కేటాయించాలి..
హైదరాబాద్‌లో చెరువులు మురికికూపాలుగా మారాయని.. వాటిని శుభ్రం చేయడానికి స్వచ్ఛభారత్ కింద పెద్దఎత్తున నిధులు కేటాయించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ కట్టర్‌ను ఎంపీ ఈటల కోరారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయం పట్ల ఖట్టర్‌కు ఈటల అభినందనలు తెలిపారు. తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కువ గృహాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.