- ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు రాధాకిషన్‌రావు పిటిషన్
- కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు ఐదో నిందితుడైన రిటైర్డు పోలీసు అధికారి పీ రాధాకిషన్‌రావు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని శుక్రవారం జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ జరిపి పూర్తి వివరాలు నివేదించాలని పోలీసులను ఆదేశించారు.
విచారణను వాయిదా వేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశారంటూ పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టయిన రాధాకిషన్‌రావు బెయిల్ కోసం కింది కోర్టును ఆశ్రయిస్తే పిటిషనర్‌పై నేరాభియోగాలు తీవ్రమైనవని, బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తు పురోగతికి అవరోధం కల్పించే అవకాశం ఉంటుందని చెప్పి బెయిల్ నిరాకరించింది.
దీంతో ఆయన హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో గత ఏడాది అక్టోబర్ 20న తాను రిటైర్డు అయ్యానని, సీనియర్ సిటిజన్‌ను కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మేకల తిరుపతన్న, ఈ ప్రభాకర్‌రావు, దుగ్యాల ప్రణీత్‌రావు, నాయిని భుజంగరావు, అరువెల శ్రవణ్‌కుమార్‌రావు తదితరులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే మేకల తిరుపతన్నకు బెయిల్ మంజూరుకు హైకోర్టు నిరాకరించింది. రాధాకిషన్‌రావు బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది.