calender_icon.png 2 October, 2024 | 4:14 AM

ఆ విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వండి

01-10-2024 12:29:22 AM

ఐఐటీ ధన్‌బాద్‌కు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: జేఈఈ అడ్బాన్స్‌డ్‌లో ప్రతిభ చాటి ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు సాధించినా గడువులోగా ఫీజు కట్టలేకపోవడంతో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సుప్రీం కోర్టు అండగా నిలిచింది. ఆ విద్యార్థికి తక్షణమే అడ్మిషన్ ఇవ్వాలని సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఐఐటీ ధన్‌బాద్‌కు ఆదేశాలు జారీచేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌గర్ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్‌కుమార్ రెండో, చివరి అవకాశంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ చాటి ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు సాధించాడు. సీటు ఖరారు చేసేందుకు జూన్ 24లోపు రూ.17,500 ఫీజు డిపాజిట్ చేయాల్సి ఉండగా.. దినసరి కూలీలైన అతుల్‌కుమార్ తల్లిదండ్రుల వద్ద అంత డబ్బు లేకపోవడంతో గ్రామస్తులు చందాలు వేసుకొని ఆ మొత్తం సమకూర్చారు.

దీంతో చివరిరోజుల్లో అతుల్‌కుమార్ ఫీజు కట్టేందుకు యత్నించగా సాంకేతిక కారణాలతో ధన్‌బాద్ ఐటీఐ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ఫీజు కట్టలేకపోయాడు. సీటు వచ్చినట్టే వచ్చి చేజారింది. ఈ క్రమంలో అతుల్ ఎస్సీ కమిషన్, జార్ఖండ్ లీగల్  సర్వీస్ సెల్‌ను ఆశ్రయించాడు.

ఎస్సీ కమిషన్ చేతలెత్తేయగా.. జార్ఖండ్ లీగల్  సర్వీస్ సెల్.. పరీక్ష ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున అతడిని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. మద్రాస్ హైకోర్టు దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని కోరింది. చివరగా అతుల్ సుప్రీంను ఆశ్రయించగా.. పూర్తి వాదనల అనంతరం.. అతుల్‌కి వెంటనే అడ్మిషన్ కల్పించాలని ఐఐటీ ధన్‌బాద్‌ను ఆదేశించింది.