12-02-2025 02:11:54 AM
ప్రభుత్వ సీఎస్ అభ్యర్థనకు హైకోర్టు సమ్మతి
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): భూదాన్ భూములపై సమగ్ర వివరాలతో నివేదిక ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కావాలని ప్రభుత్వ సీఎస్ కోరగా, హైకోర్టు అందుకు సమ్మతించింది. విచారణను మార్చి 10కి వాయిదా వేసింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం పరిధి సర్వే నంబర్ 182లోని 10.29 ఎకరాల భూమికి సంబంధించి అప్పటి కలెక్టర్ అమోయ్‌కుమార్, డీఆర్వో ఆర్పీ జ్యోతి వారసత్వ పట్టా జారీ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని.. 2024లో రెండుసార్లు ఫిర్యాదు చేసినా యంత్రాంగం నుంచి స్పందన లేదని నవాబ్ ఫరూఖ్ అలీఖాన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణకు చేపట్టారు. భూదాన్ భూములపై నివేదిక సమర్పించాలని, లేని పక్షంలో ప్రభుత్వ సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించగా, సీఎస్ అఫిడవిట్ దాఖలు చేశారు. “భూదాన్ భూములపై ‘భూదాన్ యజ్ఞ బోర్డు’ సంబంధిత అధికారి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఇప్పటికే విచారణ ప్రారంభించారు.
తుది విచారణ ఈనెల 15న జరుగుతుంది. చివరి నివేదికను సమర్పించేందుకు సమయం ఇవ్వాలి’ అని సీఎస్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేశారు.