దసరాలోపు పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తా
వచ్చే ఏడాదిలో చక్కెర పరిశ్రమ తెరిపిస్తా
కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి
జగిత్యాల, మే 10 (విజయక్రాంతి): ‘సుదీర్ఘకాలం పాటు జగిత్యాలకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించా. అనేక అభివృద్ధి పనులు చేపట్టా. ఇప్పుడు వయస్సు మీదపడింది. అయినా మీ మధ్యే ఉంటా. చివరి శ్వాస వరకు పనిచేస్తా. రుణం తీర్చుకునేందుకు అవకాశం ఇవ్వండి’ అని కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగిత్యాల జిల్లా చల్‌గల్, మోరపల్లి, మోహన్‌రావుపేట, తాటిపల్లి, హస్నాబాద్, చర్లపెల్లి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
మళ్లీ ఎన్నికలను తాను చూస్తానో లేదోనన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైనా వెరవకుండా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. ప్రజలను తనను ఆశీర్వదించాలన్నారు. ఎంపీగా ధర్మపురి అరవింద్ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి తప్పించుకున్నారని ధ్వజమెత్తారు. తన హయాంలో చల్‌గల్ లో 25 ఎకరాల్లో మామిడి మార్కెట్ ఏర్పాటు చేశానని, ఇప్పటికీ రైతులు తన పేరును తలచుకుంటారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2004లోనే పంటలకు ఉచిత విద్యుత్ ఇచ్చిందని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న దాఖలాలు లేవని తేల్చిచెప్పారు. యూపీఏ హయాంలో 50 కిలోలు ఉండే యూరియా బస్తా ఇప్పుడు 45 కిలోలకు తగ్గించారని మండిపడ్డారు. 2008లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏక మొత్తంగా రూ.లక్ష వరకు రైతురుణమాఫీ చేసిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నదన్నారు.
రెండు నెలల్లో రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. గల్ఫ్‌లో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామన్నారు. చల్‌గల్ ప్రదర్శన క్షేత్రంలో ఉద్యాన కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. చక్కర కర్మాగారాన్ని వచ్చే ఏడాదిలో పునః ప్రారంభిస్తామన్నారు. దసరాలోపు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రచారంలో పార్టీ నేతలు జున్న రాజేందర్ జితేందర్‌రావు, పెండెం నాగలక్ష్మి, బోల్ల సీతమ్మ, గంగారాం, భూమారెడ్డి, రాజన్న పాల్గొన్నారు.