calender_icon.png 10 March, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్యాల పెంపుదలే శ్రీరామ రక్ష

07-03-2025 03:36:30 PM

గీతం ఇండస్ట్రియల్ కాంక్లేవ్ 2.0లో వర్ధమాన ఇంజనీర్లకు పరిశ్రమ నిపుణుల సూచన

నిరంతర విద్యార్థిగా నైపుణ్యాల పెంపుదల, పునఃనైపుణ్యాలు పొందడం తప్పనిసరని స్పష్టీకరణ

సంగారెడ్డి, (విజయక్రాంతి): పెరుగుతున్న ఆటోమేటెడ్ ప్రపంచంలో సందర్భోచితంగా ఉండటానికి నిరంతర నైపుణ్యాల పెంపుదల, పునఃనైపుణ్యాలతో పాటు మార్పును అందిపుచ్చుకోవడం తప్పని సరి  అని వర్ధమాన ఇంజనీర్లకు పరిశ్రమ నిపుణులు స్పష్టీకరించారు. శుక్రవారం పటాన్ చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో  పరిశ్రమ-విద్యా సంస్థల మధ్య అంతరాన్ని తగ్గించాలనే యోచనతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) ‘గీతం ఇండస్ట్రీ కాంక్లేవ్-2.0’ను(GITAM Industry Conclave 2.0) విజయవంతంగా నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రముఖ పరిశ్రమల నాయకులు, యువ నిపుణులను ఒకచోట చేర్చడమే గాక, విద్యా సంస్థ-కార్పొరేట్ ప్రపంచం మధ్య అభివృద్ధి చెందుతున్న బంధం మరింత బలపడేందుకు ప్రయత్నించింది.

ఈ కాంక్లేవ్ ప్రారంభోత్సవంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారి కె.విజయ్ దత్, ఎట్ నెస్ట్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్య నిర్వహణాధికారి సీహెచ్. నెహ్రూ బాబు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. పరిశ్రమ-విద్యా సంబంధాలను బలోపేతం చేయవలసిన అవసరాన్ని విజయ్ నొక్కి చెబుతూ, అత్యాధునిక సాంకేతికతతో పనిచేస్తున్న యంత్రాలను వీక్షించేందుకు గాను గీతం విద్యార్థులు ఆర్డినెన్స్ ఫ్యాకర్టీని సందర్శించాలని ప్రోత్సహించారు. విద్యార్థులు మార్పును స్వీకరించాలని, వాస్తవ ప్రపంచ సమస్య పరిష్కార మనస్తత్వాన్ని అలవరచుకోవాలని నెహ్రూ సూచించారు. స్థిరమైన సంస్థలు నిర్మించంలో పర్యావరణ, సామాజిక, పాలన (ఈఎస్జీ) సూత్రాల ప్రాముఖ్యతను గుర్తించాలన్నారు.

ఈ సందర్భంగా ఆయా పరిశ్రమ నిపుణులతో మూడు ప్యానెల్ చర్చలు జరిగాయి. ఆటోమేషన్ టు ఆగ్మెంటేషన్: మానవ-కేంద్రీకృత వ్యూహాలు, క్రతిమ మేధస్సు (ఏఐ) ఆధారిత వాతావరణం అనే అంశంపై రాఘవేంద్ర అభిషేక్ (అడోబ్), శుభం త్రిపాఠి (అటోస్ సింటెల్), నెహ్రూ బాబు (ఎట్ నెస్ట్), ఆదిత్య ఉమాకాంత్ (వెరిజోన్) తమ దృక్పథాలను సదస్యులతో పంచుకున్నారు. ఏఐ పరిశ్రమలను మారుస్తుంది కానీ, మానవ పాత్రలను భర్తీ చేయదని, ఆ మార్పును అందిపుచ్చుకోవడంలో విఫలమైన వారికి మాత్రమే కొంతమేర నష్టం చేకూర్చవచ్చన్నారు. వేగంగా మారు తున్న సాంకేతికత ప్రపంచంలో సందర్భోచితంగా ఉండాలని, మార్పును అందిపుచ్చుకునేలా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

ఇండస్ట్రీ 5.0: స్మార్ట్ తయారీ యుగంలో మానవ-కేంద్రీకృత ఆవిష్కరణ అనే అంశంపై కేసీ మోహన్ (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ), అంకిత గుప్తా (కిర్లోస్కర్), సత్యపాల్ రెడ్డి గట్ల (లెన్స్ కార్ట), వెంకటేష్ నరసింహన్ (సిలికాన్ ల్యాబ్స్), సి. వెంకట సాయి కిరణ్ (స్కైరూట్) తమ లోతైన అవగాహనను వెల్లడించారు. స్మార్ట్ తయారీలో మానవ-కేంద్రీకృత ఆవిష్కరణ యొక్క పాత్రతో పాటు అధునాతన సాంకేతికతలను మానవ నైపుణ్యంతో ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకతను వారు నొక్కి చెప్పారు. 

సాంకేతిక నైపుణ్యాలకు మించి సామర్థ్యాలను పెంపొందించడం: విద్యను క్రియాశీలమైన పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చడం అనే అంశంపై నిడమర్తి ప్రశాంత్ (అవేవా), ఇమ్యాన్యుమేల్ గోసుల (ఈపీఏఎం), సనా హుస్సేన్ (ఎస్ఏపీ), రాజేష్ యెండూరి (వియాప్లస్)లతో కూడిన ప్యానల్ చర్చించింది. పరిశ్రమ యొక్క నిరంతరం అభివృద్ధి చెందుతున్న డిమాండ్లను తీర్చడానికి పట్టభద్రులలో సాఫ్ట్ స్కిల్స్, అనుకూలత, విమర్శనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకతపై ఆలోచింపజేసేలా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

తొలుత, గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నిరంతరం నేర్చుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామంటూ, పరిశ్రమ-విద్య మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడంలో గీతం నిబద్ధతను ఆయన నొక్కి చెప్పారు. స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి, సీజీసీ డైరెక్టర్ డాక్టర్ కె.మమత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో గీతం అంకితభావాన్ని వారు పునరుద్ఘాటించారు. ఇందులో పాల్గొన్న నిపుణులు తాజా పరిశ్రమ ధోరణులు, స్థిరమైన ఆవిష్కరణల భవిష్యత్తుపై లోతైన అవగాహన కల్పించారు.