06-03-2025 06:04:21 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): బాలికలు లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆకాంక్షించారు. గురువారం ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో జిల్లా మహిళ, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం సంయుక్తంగా నిర్వహించిన బేటి బచావో- భేటీ పడావో దశాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... బాలికలను బ్రతికించుకుందామని, వారిని ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అందరం ప్రోత్సహించాలని అన్నారు.
బాలికలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే చదువుతో పాటు క్రీడారంగంలో రాణించాలని అన్నారు. విద్యార్థినులు యుక్త వయసులో వచ్చే సమయంలో మరింత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రంగాలలో రాణిస్తారని అన్నారు. బాలికలను కాపాడుకోవడం వారిని చదివించుకోవడంతో పాటు స్వేచ్ఛగా అన్ని రంగాలలో రాణించే విధంగా అందరం కృషి చేయాలని అన్నారు. భేటీ బచావో - భేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో 40 ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలలో ప్రత్యేక బృందం ద్వారా ప్రేరణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలని అన్నారు. బాల్యవివాహాలు నిరోధించే దిశగా ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని తెలిపారు. బాలికల చదువు కుటుంబంతో పాటు దేశాభివృద్ధికి ముందడుగుని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త శారద, మాస్టర్ ట్రైనర్లు రాజేష్, సుందిళ్ల రమేష్, ప్రిన్సిపాల్ రత్న బాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.