calender_icon.png 6 March, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికలు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

06-03-2025 12:00:00 AM

జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్

కుమ్రం భీం అసిఫాబాద్, మార్చి 5(విజయక్రాంతి): బాలికలు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని అవి సాధించే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలని జిల్లా మహిళా, శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ అన్నారు. బుధవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా మహిళా, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భేటీ బచావో-భేటీ పడావో దశాబ్ది ఉత్సవాలలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ బాలికలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే చదువులో రాణించాలని తెలిపారు. విద్యార్థినిలు యుక్త వయసు సమయంలో మరింత శుభ్రత పాటించాలని, శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువుపై ఏకాగ్రత ఉంటుందని, క్రీడారంగంలో సైతం రాణించాలని తెలిపారు. బాలికలను కాపాడుకోవడం, చదివించుకోవడం తో పాటు వారికి స్వేచ్ఛగా అన్ని రంగాలలో తోడ్పాటు అందించాలని తెలిపారు.

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 10వ తేదీ వరకు జిల్లాలోని 40 ప్రభుత్వ పాఠశాలలు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలలో ప్రత్యేక బృందం ద్వారా ప్రేరణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థినులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. బాల్య వివాహాలను నిరోధించే దిశగా ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని, బాలికల చదువు కుటుంబానికి, దేశానికి ఎంతో ముఖ్యమన్నారు.ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త శారద, ఎస్. ఓ. నలంద, సుండిల రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.