నేడు భారత్, ఆసీస్ తొలి వన్డే
బ్రిస్బేన్: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2 సొంతం చేసుకున్న భారత అమ్మాయిలు ఆసీస్ గడ్డపై వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమయ్యారు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా టీమిండియా నేడు కంగారూలతో తొలి వన్డే ఆడనుంది. పరిమిత ఓవర్ల ఆటలో ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవడం హర్మన్ సేనకు సవాల్ అని చెప్పొచ్చు.
2021లో ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే సిరీస్‌ను భారత్ 2 కోల్పోయింది. ఆసీస్ పిచ్‌లు మన బ్యాటర్లకు పెద్ద పరీక్ష కానుంది. పేస్‌కు స్వర్గధామంగా నిలిచే పిచ్‌లపై మనోళ్లు ఎలా ఆడతారన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఆసీస్‌తో సిరీస్ భారత్‌కు కీలకం కానుంది. ఫామ్ లేమితో సతమతమవుతోన్న ఓపెనర్ షెఫాలీ వర్మను ఈ సిరీస్‌కు పక్కనబెట్టారు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉంది.
ఒకటి రెండు మ్యాచ్‌ల్లో మినహా గత ఆరు వన్డేల్లో 448 పరుగులు చేసింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఏడాది ఆరంభంలో ఫామ్‌తో ఇబ్బంది పడినప్పటికీ టీ20 ప్రపంచకప్‌లో రాణించడం ద్వారా తిరిగి ఫుంజుకున్నట్లుగా అనిపిస్తోంది. సీనియర్ ఆటగాళ్లు జేమీమా రోడ్రిగ్స్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కీలకంగా మారనున్నారు.
బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్, అరుంధతీ రెడ్డి, ప్రియా మిశ్రా, రాధా యాదవ్, సైమాలతో పటిష్టంగా ఉంది. ఇక కొన్నాళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న వికెట్ కీపర్ రిచా ఘోష్‌తో పాటు హార్లిన్ డియోల్, టిటాస్ సాధు, మిన్నూ మానీ లాంటి ఆటగాళ్లకు ఈ వన్డే సిరీస్ సవాల్‌గా మారనుంది. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హేలీ మోకాలి గాయంతో సిరీస్‌కు దూరమవ్వడంతో తాహిలా మెక్‌గ్రాత్ బాధ్యతలు చేపట్టనుంది.