మహిళల ఆసియా కప్‌లో మన అమ్మాయిల బృందం అదరగొడుతోంది. లీగ్ దశ నుంచి ఓటమి ఎరుగని టీమిండియా సెమీస్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తూ అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట బౌలింగ్‌లో రేణుకా, రాధా యాదవ్‌లు విజృంభించగా.. ఆపై మంధన మెరుపు బ్యాటింగ్‌తో అలరించడంతో బంగ్లాపై ఘన విజయం సొంతం చేసుకుంది. ఎనిమిదో సారి ఆసియా కప్ టైటిల్‌ను అందుకునేందుకు భారత్ అడుగుదూరంలో నిలిచింది.
దంబుల్లా: మహిళల ఆసియా కప్‌లో భారత అమ్మాయిల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఎనిమిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు హర్మన్ సేన అడుగు దూరంలో నిలిచింది. దంబుల్లా వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. పటిష్టమైన మన బౌలింగ్ ధాటికి బంగ్లా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (51 బంతుల్లో 32; 2 ఫోర్లు) టాప్ స్కోరర్.
షోర్నా అక్తర్ (18 బంతుల్లో 19 నాటౌట్) పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, రాధా యాదవ్‌లు చెరో 3 వికెట్లు తీయగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మలు చెరొక వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన మన అమ్మాయిలు 11 ఓవర్లలో వికెట్ నష్టోపోకుండా 83 పరుగులు చేసి ఘన విజయాన్ని నమోదు చేసుకున్నారు. స్మృతి మంధన (39 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్సర్) రఫ్పాండించగా.. షఫాలీ వర్మ (28 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు) సహకరించింది. బౌలింగ్‌లో కీలక వికెట్లు తీసిన రేణుకా సింగ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకుంది. ఆదివారం ఆసియా కప్ ఫైనల్ పోరు జరగనుంది.
రేణుక ఫటాఫట్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు రేణుకా సింగ్ ఆరంభంలోనే చుక్కలు చూపించింది. పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై చెలరేగిన రేణుకా పవర్ ప్లే ముగిసేలోపే టాపార్డర్‌ను పెవిలియన్ చేర్చింది. అనంతరం రంగంలోకి దిగిన స్పిన్నర్ రాధా యాదవ్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ వికెట్ల వేటను షురూ చేసింది. రెండు వైపుల నుంచి భారత బౌలర్లు దాడి చేయడంతో బంగ్లాకు పరుగులు రావడం గగనమైపోయింది. అయితే మన బౌలర్లు ఆఖర్లో ఆలౌట్ చేస్తారనుకున్నప్పటికీ బంగ్లా పూర్తి ఓవర్లు ఆడి ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం స్వల్ప ఛేదనలో మంధన మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆరంభం నుంచే బౌండరీల వర్షం కురిపించింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టిన శ్రీలంక భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్ : 20 ఓవర్లలో 80/8 (నిగర్ సుల్తానా 32; రేణుకా 3/10, రాధా 3/14)
భారత్ : 11 ఓవర్లలో 83/0 (మంధన 55 నాటౌట్, షఫాలీ 26 నాటౌట్)