23-04-2025 01:39:22 AM
హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్, సెకండియర్‌లోనూ వారే హవా కొనసాగించారు. ఫస్టియర్‌లో బాలికలు 73.8శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 59.74శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో బాలికలు 77.73శాతం, బాలురు 64.60శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఈసారి ఇంటర్ ఫలితాల ఉత్తీర్ణతా శాతం పెరిగింది.
ఈసారి 66.89 శాతం కాగా, గతేడాదిలో 61.06 శాతం (వార్షిక, సప్లిమెంటరీ కలిపి)గా నమోదైంది. సెకండియర్‌లో ఈ ఏడాది 71.37 శాతం కాగా, గతేడాది 69.46 శాతం (వార్షిక, సప్లిమెంటరీ కలిపి) ఉత్తీర్ణత సాధించారు. ఇక ఫస్టియర్ జనరల్‌లో 2,93,852 (66.89 శాతం) మంది, వొకేషనల్‌లో 28,339 (57.68 శాతం) మంది పాసవగా, మొత్తం కలిపి 3,22,191 (65.96 శాతం) మంది పాసయ్యారు.
సెకండియర్‌లో రెగ్యులర్ విద్యార్థులు 2,85,435 (71.37 శాతం) మంది, ప్రైవేట్ విద్యార్థులు 17,358 మంది, వొకేషనల్ కలిపి మొత్తంగా 3,33,908 (65.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ పరీక్షా ఫలితాలను నాంపల్లి లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తోపాటు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, స్పెషల్ సెక్రటరీ హరిత, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ జయప్రదాబాయితో కలిసి విడుదల చేశారు.
అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. జనరల్, వొకేషనల్ కలిపి మొత్తంగా 9,97,012 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 6,56,099 (65.81 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఉత్తీర్ణులైన వారికి అభినందనలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్‌కి విద్యాశాఖ నిరంతరం కృషి చేస్తుందని ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా జపాన్ పర్యటనలో ఉండి...
తన ద్వారా ఈ సందేశాన్ని విద్యార్థులు, పేరెంట్స్‌కు తెలపామన్నారని చెప్పారు. విద్యార్థులందరికీ సీఎం రేవంత్‌రెడ్డి తరపున అభినందనలు తెలిపారు. విద్యార్థులందరికీ దగ్గరుండి బోధిం చిన అధ్యాపకులకు, పారదర్శకంగా ఫలితాలు ప్రకటించిన ఇంటర్ బోర్డుకు అభినం దనలు చెప్పారు.
చిట్టచివరి స్థానంలో మహబూబాబాద్, కామారెడ్డి..
ఫస్టియర్ ఫలితాల్లో 77.21 శాతంతో మేడ్చల్ జి ల్లా టాప్‌లో నిలవగా, సెకండియర్‌లో ములుగు 81.06 శాతం అగ్రస్థానంలో నిలిచింది. ఫస్టియర్‌లో ద్వితీయ స్థానంలో రంగారెడ్డి (76.36 శాతం), మూడో స్థానంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ (70.52 శాతం) నిలవగా, సె కండియర్‌లో ద్వితీయ స్థా నంలో కుమ్రంభీం ఆసిఫాబాద్ (80.24 శాతం), మూ డో స్థానంలో మేడ్చల్ (77. 91శాతం) నిలిచాయి. ఫస్టియర్ ఫలితాల్లో చిట్టచివరి స్థానంలో 48.43 శాతంతో మహబూబాబాద్, సెకండియర్‌లో కామారెడ్డి (56.38 శాతం) నిలిచాయి. ఇదిలా ఉంటే సెకండియర్‌లో ఎంపీ సీలో 997 హయ్యస్ట్ మార్కులుగా నమోదైనట్లు సమాచారం.
గురుకుల కాలేజీల్లో మెరుగైన ఫలితాలు..
ప్రైవేట్ కాలేజీల కంటే కూడా గురుకుల కాలేజీల్లో ఉత్తమ ఫలితాలు నమోదయ్యా యి. ప్రైవేట్‌లో ఫస్టియర్-69.8 శాతంకాగా, సెకండియర్ 65.83 శాతం నమోదైతే, 92.9 శాతంతో టీఎస్‌ఆర్జేసీ మొదటి స్థానంలో నిలిచాయి. సోషల్ వెల్ఫేర్ కాలేజీలు ఫస్టియర్-77.66 శాతం, సెకండియర్‌లో 84.38 శాతం నమోదయ్యాయి.
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు 46.16 శాతంతో చివరి స్థానంలో నిలిచాయి. 53.44 శాతంతో ఆతర్వాతి స్థానంలో ప్రభుత్వ కాలేజీలు వెనుకంజలో ఉన్నాయి. అయితే గతేడాది కంటే ఈసారి ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం కాస్త పెరిగిందని అధికారులు తెలిపారు.
మే 22 నుంచి సప్లిమెంటరీ ఫలితాలు..
వచ్చే నెల 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించామని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఫలితాలను ప్రకటించామన్నారు. ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు.
ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు విద్యార్థులు ఈనెల 23 నుంచి 30 వరకు ఫీజు చెల్లించాలని కోరారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు వారం రోజుల గడువిచ్చినట్లు చెప్పారు. రీ కౌంటింగ్‌కు పేపర్‌కు రూ.100చొప్పున, రీవెరిఫికేషన్‌కు పేపర్‌కు రూ.600 చొప్పున ఫీ జును చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
అరగంట ఆలస్యంగా ఫలితాలు విడుదల..
ఇంటర్ బోర్డు మంగళవారం మధ్యా హ్నం 12 గంటలకు ఫలితాలను ప్రకటిస్తామని తొలుత ప్రకటించిన విషయం తెలిసిం దే. అయితే చెప్పిన సమయానికి 30 నిమిషాలు ఆలస్యంగా ప్రకటించారు. 12 గంట లకే ప్రకటిస్తారని తెలపడంతో విద్యార్థులు, పేరెంట్స్ అంతా ఫలితాల కోసం ఎదురుచూశారు.
టాప్ స్కోర్లు వీరివే..
ఫస్టియర్ ఎంపీసీలో సీ అక్షయ, పుట్టపోగుల వర్షిణి, మామిడి సమతకు 470 మార్కులకు 469 (99.8 శాతం) మార్కులు వచ్చాయి. సెకండియర్ ఎంపీసీలో 1000 మార్కులకుగానూ 996 (99.6 శాతం) మార్కులతో ఇందూరి రష్మిత, వారణాసి మనస్వి, కూన రుత్విక్, పల్లెపంగు వసంత్ కుమార్ టాప్‌లో నిలిచారు.
అలాగే ఫస్టియర్ బైపీసీలో 440 మార్కులకు గానూ 439 (99.8 శాతం) మార్కులతో బీ లావ ణ్య, హఫ్స బేగం, సేదా అర్షియా సమ్రీన్, వడ్ల వైష్ణవి, సాదియా తబస్సుమ్ అత్యధిక మార్కులు సాధించారు. సెకండియర్ బైపీసీ గ్రూపులో 1000 మార్కులకు గానూ జక్కు అంజన 997 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. సెకండియర్ ఎంఈసీ గ్రూపులో టాప్ మార్కులు 990గా నమోదయ్యాయి.
గొప్పగా రాణించాలి..
ఇంటర్ విద్యార్థులకు సీఎం అభినందనలు
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. మంగళవారం ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘భవిష్యత్ లో మీరు ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్పగా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం తెలిపారు.