calender_icon.png 18 October, 2024 | 8:54 PM

డిగ్రీ ప్రవేశాల్లో బాలికలే అధికం

18-10-2024 01:37:14 AM

  1. ఈ ఏడాది 2 లక్షలకు చేరిన అడ్మిషన్లు
  2. మొత్తం సీట్లలో 42 శాతం మాత్రమే భర్తీ

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): 2024-25 విద్యాసంవత్సరంలో చేపట్టిన డిగ్రీ అడ్మిషన్లలో అమ్మాయిలే ఎక్కువ మంది ప్రవేశాలు పొందారు. మొత్తం 1,96,442 విద్యార్థులు ప్రవేశాలు పొందితే, వీరిలో 1,05,329 (53 శాతం) మంది బాలికలే ఉండడం గమనార్హం.

గతేడాది కూడా అమ్మాయిలే ఎక్కువ (52.84 శాతం) మంది చేరారు. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి అమ్మాయిల సంఖ్య పెరగ్గా, అబ్బాయిల సంఖ్య కాస్త తగ్గింది. రాష్ట్రంలో 1,055 ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ కాలేజీలున్నాయి. వీటిలో 4,57,704 సీట్లు ఉండగా 1,96,442 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందారు.

డిగ్రీ ఫస్టియర్‌లో ఇంకా 2,61,262 సీట్లు మిగిలాయి. మొత్తం సీట్లల్లో కేవలం 42 శాతం సీట్లు మాత్రమే ఈ ఏడాది భర్తీ అయ్యాయి. రాష్ర్టంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రాష్ర్టంలో 816 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలుండగా, వీటిల్లో 3,44,793 సీట్లకు 38.39 శాతమే భర్తీ అయ్యాయి. గురుకుల డిగ్రీ కాలేజీల్లోని సీట్లకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే  యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 89 వేల సీట్లకు 61 శాతం (55,361 సీట్లు) భర్తీ కావడం విశేషం. 

బీకామే టాప్..

రాష్ట్రంలో ఇంటర్ రెగ్యులర్ సహా, సప్లిమెంటరీ పరీక్షలు కలిపితే 3.90 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. వీరిలో 90 వేల మంది ఇంజినీరింగ్ వైపు వెళ్తున్నారు.. ఇక నీట్ రాసి మెడిసిన్ వైపు వెళ్తున్నవారు మరికొందరున్నారు. కానీ డిగ్రీ ఫస్టియర్‌లో 4.57 లక్షల సీట్లు అందుబా టులో ఉన్నాయి. ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించిన వారి కంటే సీట్లు అధికంగా ఉండటంతో సీట్లు మిగులుతున్నాయని అధికారులంటున్నారు. కోర్సుల వారీగా తీసుకుంటే బీకాంలో అత్యధికంగా 77,469 మంది విద్యార్థులు చేరారు.