- ఏకైక టెస్టులో భారత్ జయభేరి
- 10 వికెట్లతో ఓడిన దక్షిణాఫ్రికా
కరీబియన్ దీవుల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు.. దక్షిణాఫ్రికాను చిత్తుచేసి టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకోగా.. స్వదేశంలో దక్షిణాఫ్రికా అమ్మాయిలకు ఏమాత్రం అవకాశం ఇవ్వని మన మహిళల జట్టు ఏకైక టెస్టులో విజయఢంకా మోగించింది. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన హర్మన్‌ప్రీత్ బృందం.. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అదే జోరు కొనసాగించింది. పలు రికార్డులు బద్దలైన పోరులో టీమిండియా 10 వికెట్లతో సఫారీలను చిత్తుచేసి కప్పు కైవసం చేసుకుంది.
చెన్నై: స్వదేశంలో భారత మహిళల జట్టు అద్వితీయ ప్రదర్శన కొనసాగుతోంది. ఇటీవల దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ చేజిక్కించుకున్న హర్మన్‌ప్రీత్ బృందం అదే ఊపులో.. టెస్టు సిరీస్ కూడా ఒడిసి పట్టింది. పరుగుల వరద పారిన ఏకైక టెస్టులో భారత్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 232/2తో సోమవారం ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా చివరకు 373 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్ వాల్వర్ట్ (122; 16 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకోగా.. డి క్లెర్క్ (185 బంతుల్లో 61; 8 ఫోర్లు, ఒక సిక్సర్) మొండిగా పోరాడే ప్రయత్నం చేసింది.
అయితే బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మన స్పిన్నర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టడంతో.. టీమిండియా ముందు రెండో ఇన్నింగ్స్‌లో 37 పరుగుల లక్ష్యం నిలిచింది. మన బౌలర్లలో స్నేహ్ రాణా, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత మహిళల జట్టు 9.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (24 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్), శుభ సతీశ్ (13 నాటౌట్) అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చారు. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 603/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్ ఆడింది.
ఇరు జట్లు కలిసి ఈ మ్యాచ్‌లో 1279 పరుగులు చేశాయి. భారత్ ఆడిన టెస్టుల్లో ఒక మ్యాచ్‌లో ఇన్ని పరుగులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించిన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ స్నేహ్ రాణా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ రెండు వికెట్లు ఖాతాలో వేసుకొని ఓవరాల్‌గా ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచింది. గతంలో జులన్ గోస్వామి ఈ ఫీట్ సాధించింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్:603/6 డిక్లేర్డ్;
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 266;
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్:
373 (వాల్వర్ట్ 122, లుస్ 109;
రాజేశ్వరి 2/55, దీప్తి 2/95);
భారత్ రెండో ఇన్నింగ్స్: 37/0 (షఫాలీ 24 నాటౌట్, శుభ 13 నాటౌట్).
జాతీయ జట్టు తరఫున టెస్టు క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకోవడాన్ని నమ్మలేకపోతున్నా. జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించడం ఆనందంగా ఉంది. నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. మున్ముందు ఇలాగే టీమిండియా విజయాల్లో కీలకం కావాలనుకుంటున్నా.
-స్నేహ్ రాణా