11-04-2025 12:10:24 AM
వివరాలు వెల్లడించిన ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి
నిజామాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ఈనెల ఆరవ తేదీన బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు 72 గంటల్లో చేదించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఏసిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ లో అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న మూడు సంవత్సరాల బాలికను మీర్జాపూర్ గ్రామం మద్నూర్ మండలంకు చెందిన బాలాజీ గైక్వాడ్ అనే నేరస్థుడు బాలికను కిడ్నాప్ చేశాడు. అనంతరం నిద్రలేచిన అమ్మమ్మ మనుమరాలు కనిపించకపోవడంతో వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలోని ఉమ్రి తదితర ప్రాంతాల్లో రైలు మార్గం ద్వారా వెళ్లినట్లు గుర్తించి ఎత్తుకెళ్లిన నిందితుడి కోసం అన్వేషించారు. ఎట్టకేలకు నేరస్థుడు ఎత్తుకెళ్లిన బాలికను మద్నూర్ మండలం మిర్జాపూర్ గ్రామంలోని తన సోదరుడు గైక్వాయిడ్ సూర్యకాంత్ ఇంటిలో దాచి ఉంచినట్లు ఏసిపి వెల్లడించారు.
కిడ్నాప్కు గురైన బాలికను సోదరులు ఇద్దరు కలిసి బాలికను అమ్ముకునేందుకు ప్లాన్ వేశారని తెలిపారు. పోలీసు బృందాలు ఆ ఇంటిపై సోదాలు నిర్వహించి బాలికను సురక్షితంగా కిడ్నాపర్ల చేరనుండి విడిపించడం జరిగిందన్నారు. కిడ్నాప్ కు పాల్పడిన ప్రధాన సూత్రధారి బాలాజీ పరారీలో ఉండగా, అతని సోదరుడు సూర్యకాంత్ ను అదుపులోకి తీసుకొని అన్నారు.
ప్రధాన సూత్రధారి బాలాజీ పై గతంలో బోధన్ లో హత్యకేసుతోపాటు బిచ్కుంద మండలంలో వాహనం చోరీ కేసు ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు కోసము ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. బాలిక కిడ్నాప్ కేసుని చాకచక్యంగా చేదించిన వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి, ఎ ఎస్ ఐ షకీల్ , ఐదుగురు పోలీసు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ క్యాష్ రివార్డ్ కోసం పోలీస్ కమిషనర్కు సిఫారసు చేశామన్నారు.