- మెదక్ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలకు నాక్-ఏ గ్రేడ్ హోదా
- హర్షం వ్యక్తం చేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు
మెదక్, నవంబర్ 15 (విజయక్రాంతి): మెదక్ పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కమిటీ (నాక్) ప్రశంసలు అందుకొని ఏకంగా ఏ గ్రేడ్‌ను దక్కించుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నాక్ బృందం 12 కళాశాలలను సందర్శించినప్పటికీ ఎక్కడా ఏ గ్రేడ్ హోదా దక్కలేదు.
కేవలం మెదక్ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల మాత్రమే ఏ గ్రేడ్ హోదాతో ముందు వరుసలో నిలిచింది. ఈనెల 5, 6 తేదీల్లో నాక్ బృందం పట్టణంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో కొనసాగుతున్న గిరిజన డిగ్రీ కళాశాలను సందర్శించింది. జాతీయ స్థాయిలోని ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో కళాశాల పనితీరును వాకబు చేశారు. ఈ సందర్భం గా విద్యార్థినులు, వారి తల్లిదండ్రుల తోనూ బృంద సభ్యులు సమావేశమయ్యారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రిన్సిపాల్
కళాశాలలో గిరిజన బాలిక విద్య కోసం జరుగుతున్న ప్రగతిని చూసి మంత్రముగ్దులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ మహిళా విద్యకు అందిస్తున్న సహకారంపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమాదేవి వారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తమ కళాశాల ద్వారా దక్కుతున్న గిరిజన మహిళా సాధికారతను వివరించారు.
కళాశాలలోని ల్యాబ్‌ల పనితీరుపై బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. తమ కళాశాలకు నాక్ బృందం ఏ గ్రేడ్ హోదా ఇవ్వడంతో శుక్రవారం విద్యార్థులు సంబురాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ బి.విజయలక్ష్మీ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి కె.శరత్ దీపిక, కేర్ టేకర్ విజేత, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే ఏ గ్రేడ్
గిరిజన మహిళా డిగ్రీ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్ హోదా ఇవ్వడం ఆనందంగా ఉంది. ఇది విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. గిరిజన సంక్షే మ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి, రీజినల్ కోఆర్డినేటర్ గంగారం నాయక్‌తో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థుల సహకారంతో ఈ ఘనత సాధించగలిగాం.
డాక్టర్ ఉమాదేవి,
కళాశాల ప్రిన్సిపాల్