- ఓపెనర్లుగా రాహుల్, జైస్వాల్
- బోర్డర్, గావస్కర్ ట్రోఫీ
పెర్త్: ప్రతిష్ఠాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో నవంబర్ 22 నుంచి మొదలుకానున్న తొలి టెస్టుకు భారత బ్యాటర్ శుబ్ మన్ గిల్ దూరమయ్యాడు. బొటనవేలికి గాయమవ్వడంతో మొదటి టెస్టుకు గిల్ దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. కాగా టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
రోహిత్, వితికా దంపతులు ఇటీవలే బిడ్డకు జన్మనివ్వడంతో అతడు కుటుంబంతో కొద్ది రోజులు గడిపిన అనంతరం అడిలైడ్ టెస్టుకు అందుబాటులోకి రానునాడు. మొదటి టెస్టుకు కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ దూరం కానుండటంతో తొలి టెస్టులో ఓపెనర్ జైస్వాల్‌తో కలిసి రాహుల్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇటీవల ఇంట్రా స్కాడ్ ప్రాక్టీస్‌లో రాహుల్‌కు గాయం కాగా.. అతడు ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడని మేనేజ్‌మెంట్ చెబుతోంది. ఇటీవల పెద్దగా రాణించని రాహుల్ ఎలా ఓపెనింగ్ చేస్తాడో అని అభిమానులంతా కలవరపడుతున్నారు. ఇక రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో జట్టుకు స్పీడ్ స్టర్ బుమ్రా నేతృత్వం వహించనున్నాడు.
గాయంతో గిల్ మొదటి టెస్టుకు దూరం అయిన తరుణంలో రాహుల్ కోలుకోవడం ఊరట కానుంది. అయితే గిల్ గాయంపై పెద్దగా ఆందోళన అవసరం లేదని.. తొలి టెస్టుకు మాత్రమే అతడు దూరం కానున్నట్లు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. దీంతో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ లేదా దేవదత్ పడిక్కల్‌లో ఒకరికి తొలి టెస్టుకు అవకాశం దక్కనుంది.