calender_icon.png 23 December, 2024 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రుల కానుక.. విజ్ఞాన వేదిక

15-09-2024 12:53:03 AM

  1. ఆలోచన అద్భుతం.. ఇతరులకూ ఆదర్శం 
  2. లక్షెట్టిపేట గురుకుల యాజమాన్యం వినూత్న ఆలోచన 
  3. ఒక్కో విద్యార్థి.. తమ తల్లిదండ్రుల ద్వారా ఒక పుస్తకం కొనుగోలు 
  4. వెయ్యి పుస్తకాలతో విద్యార్థుల లైబ్రరీ

మంచిర్యాల, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో కొత్త సంప్రదాయానికి నాంది పలికింది. యాజమాన్యం గురుకులంలో లైబర్రీ ఏర్పాటుకు ప్రభుత్వంపై ఆధారపడకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భాగస్వాములను చేసింది. తద్వారా లైబ్రెరీకి అవసరమైన సుమారు పుస్తకాలను సమకూర్చింది. గత రెండో శనివారం రోజు గురకులానికి సంచార పుస్తకాల విక్రయ వాహనాన్ని రప్పించి తల్లిదండ్రులు, పిల్లలతో పుస్తకాలు కొనుగోలు చేయించారు. 

ఉపాధ్యాయుల ప్రోత్సాహం..

ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారికి పిల్లల తల్లిదండ్రులు సైతం సహకరించారు. విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు మొదటి అడుగు వేసిన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మహేశ్వర రావుతో పాటు చొరవ తీసుకున్న దంపతులు విజయ్, సరితను గురుకుల పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, కమిటీ సభ్యులు మాణిక్యం, మురళి, వీరస్వామి, సుజాత అభినందించారు. 

ఏకంగా వెయ్యి పుస్తకాలు..

పుస్తకాలే విజ్ఞాన భాండాగారాలని తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రుల సాయంతో సుమారు వెయ్యికి పైగా పుస్తకాలు కొనుగోలు చేశారు. గురుకుల పాఠశాలలో సుమారు 650 మందికిపైగా విద్యార్థులు ఉండగా.. వీరిలో ఎంపీసీ, బైపీసీ, ఒకేషనల్ విద్యార్థులు 370 మందికిపైగా ఉన్నారు. వీరంతా పాఠశాల, కళాశాల ఉపాధ్యాయ, అధ్యాపక బృందంతో కలిసి విద్యార్థులకు అవసరమయ్యే జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్‌తో పాటు ఇతర అకడమిక్ రిలేటెడ్ పుస్తకాలను సేకరించారు. 

పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకే.. 

ఈరోజుల్లో పిల్లలకు సెల్‌ఫోన్, సోషల్ మీడియాపై ఉన్న ఆసక్తి పుస్తకాలపై తగ్గింది. విద్యార్థులలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకు అధ్యాపకులు, తల్లిదండ్రుల సహకారంతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తల్లిదండ్రులు ఇచ్చిన పుస్తకాలు చదవాలనే ఆసక్తి ప్రతి విద్యార్థిలో ఉంటుంది. పిల్లలు విజ్ఞానం పెంచడానికి పుస్తకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

 రమాకల్యాణి, ప్రిన్సిపాల్, సాంఘిక సంక్షేమ గురుకులం