calender_icon.png 31 March, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ యువతకు ఆవిర్భావ కానుక

26-03-2025 12:00:00 AM

రాజీవ్ యువ వికాసం పథకం మార్గదర్శకాలు విడుదల

జూన్ 2న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా రుణాలు పంపిణీ

ఆరు క్యాటగిరీలుగా స్వయం ఉపాధి రుణాలు

జనాభా ప్రాతిపదికన యూనిట్ల మంజూరు

ఏప్రిల్ 5వ తేదీలోపు దరఖాస్తుకు అవకాశం

గ్రామాల్లో ఏడాదికి రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల ఆదాయ పరిమితి

పథకానికి బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయింపు

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలను అందించేందుకు రూ.6వేలకోట్లతో ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం మార్గదర్శకాలను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నిరుద్యోగ యువతకు ఈ రుణాలను అందజేసేందుకు సిద్ధమైంది. మం డలాలు, మున్సిపాలిటీలను యూనిట్లుగా తీసుకొని.. జనాభా ప్రాతిపదికన రుణాల లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం షెడ్యూల్డ్ కులాల విభా గం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన పేద యువకులకు కనిష్ఠంగా రూ.50వేల నుంచి గరిష్ఠంగా రూ.4లక్షల వరకు రుణాలు ఇవ్వాలని నిర్ణ యించింది. ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీఎస్‌సీసీడీసీ) వ్యవహరించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. స్వయం ఉపాధి రుణాలను ఆరు కేటగిరీలుగా ఇవ్వనుంది. ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ఈ నెల 16వ తేదీన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఎంఎల్‌సీ, డీఎల్‌సీ స్థాయిలో స్క్రూట్నీ..

లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి ముం దు ‘ఓబీఎంఎంఎస్’ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి, గ్రామాలు అయితే మండలాల్లోని ప్రజాపాలన(ఎంపీడీవో) సేవాకేంద్రాలు, పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో సమర్పించాలి. అనంతరం ఆయా కార్యాలయాల్లోని హెల్ప్‌డెస్క్‌లు ఆ అప్లికేషన్లను ఆన్‌లైన్ చేస్తాయి. అనంతరం ఎంపీడీవో స్థాయి అధికారి నేతృత్వంలోని మండల్ లెవెల్ కమిటీ(ఎంఎల్‌సీ) ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను ఎంపిక చేస్తుంది. ఆ జాబితా ను వెరిఫికేషన్ కోసం బ్యాంకులకు పంపుతుంది. అనంతరం బ్యాంకర్ ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను డిస్ట్రిక్ట్ లెవెల్  కమిటీ(డీఎల్‌సీ)కి ఎంఎల్‌సీ పంపుతుంది. తర్వాత కలెక్టర్ నేతృత్వంలోని డీఎల్‌సీ తుది జాబితా ప్రకటిస్తుంది. అయితే నాన్ బ్యాంక్ లింకేజీ స్కీమ్స్‌కు బ్యాంకుల వెరిఫికేషన్  ఉండదు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు స్వ యం ఉపాధి అంశాలపై కలెక్టర్ ఆధ్వర్యంలో 15 రోజుల్లో ట్రైనింగ్ సెషన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత రుణాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు.

పథకానికి అర్హులు వీరే.. 

వ్యవసాయ సంబంధిత రుణాలకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.

వ్యవసాయేత రుణాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. 

గ్రామాల్లో అయితే ఏడాది రూ.1.5లక్షల ఆదాయం మించకూడదు.

పట్టణాలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆదాయం రూ.2లక్షలు ఉండాలి.

రేషన్ కార్డు వివరాలను దరఖాస్తు ఫారంలో నమోదు చేయాలి. రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.


దరఖాస్తుకు కావాల్సినవి ఇవే..

  1. ఆధార్ కార్డు, రేషన్ కార్డు/ఇన్‌కమ్ సర్టిఫికెట్
  2. కుల ధ్రువీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్
  3. పట్టాదార్ పాస్‌బుక్ (వ్యవసాయ రుణాలకు)
  4. సదరమ్ సర్టిఫికెట్ (వికలాంగులు),పాస్‌పోర్టు   
  5. సైజ్ ఫొటో, వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికెట్
  6. కుటుంబంలో ఒకరు స్కీమ్ కింద లబ్ధిపొందితే ఐదేళ్ల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు.
  7. స్వయం ఉపాధి కోసం మొదటిసారి దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యం
  8. కేటాయించిన యూనిట్లలో మహిళలకు 25 శాతం, దివ్యాంగులకు 5 శాతం 
  9. తెలంగాణ, ఎస్సీ వర్గీకరణ ఉద్యమాల్లో మరణించిన కుటుంబాలకు అవకాశం
  10. స్వయం ఉపాధిలో నైపుణ్య శిక్షణ పొందిన వారికి చాన్స్

ముఖ్యమైన తేదీలు

  1. ఏప్రిల్ 5వ తేదీలోపు దరఖాస్తును ప్రజాపాలన సేవా కేంద్రాల్లో సమర్పించాలి
  2. ఏప్రిల్ 6 తేదీ వరకు మండల స్థాయిలో ఎంఎల్‌సీ స్క్రూట్నీ చేసి డీఎల్‌సీకి ఆ జాబితాను అందజేస్తుంది
  3. మే 21 తేదీ వరకు డీఎల్‌సీ స్క్రూట్నీ చేసి తుది జాబితాను ప్రకటిస్తుంది
  4. జూన్ 2 తేదీల్లో రుణం మంజూరు