- వీడని పాత, కొత్త నేతల పంచాయితీ
- గతంలో ఖైరతాబాద్, జగిత్యాల, గద్వాల, బాన్సువాడ, ఘన్‌పూర్‌లోనూ అసమ్మతి
- తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెంకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన పార్టీ క్యాడర్
- ఘటనపై విచారణ కమిటీ వేసిన పీసీసీ చీఫ్
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): అధికార కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య అంతర్గత పోరు రోజుకోతీరున రచ్చకెక్కుతోంది. ప్రధానంగా పాత, కొత్త నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. సొంతపార్టీకి చెందినవారికి వ్యతిరేకంగా క్యాడర్ రోడ్డెక్కడంతో కాంగ్రె స్ నాయకత్వానికి తలనొప్పిగా మారింది.
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరికను కాట శ్రీనివాస్, ఆయన వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల ను వేధించాడని, ఇప్పుడు పార్టీ మారినా బీఆర్‌ఎస్ వాళ్లకే పెద్దపీట వేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
ఏకంగా గూడెం దిష్టి బొమ్మను దగ్ధం చేయడంతో పాటు ఎమ్మె ల్యే క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి దాడి చేయడం వరకు వెళ్లింది. క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో బదులు కేసీఆర్ ఫొటో పెట్టడంపై కాంగ్రెస్ కేడర్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సైతం కేసీఆర్ ఫొటో ఉంటే తప్పేంటని, ఎదురు ప్రశ్నించడంతో పాటు.. ఆఫీస్‌పై దాడికి యత్నించినవారిని జైలుకు పంపుతానని హెచ్చరించారు.
ఈ పంచాయితీ ఎంతకు దారితీస్తుందోనని రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మె ల్యే దానం నాగేందర్ రాకను ఖైరతాబాద్ కార్పొరేటర్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి వ్యతిరేకించారు. అధిష్ఠానం విజయారెడ్డిని బుజ్జగించి దానంను పార్టీలో చేర్చుకుంది. అయితే ఇటీవల హైడ్రా, ఫార్ములా రేసు తదితర విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
కాగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. జగిత్యాల నియోజకవర్గంలో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితి నెలకొంది.
సంజయ్ రాకను జీవన్‌రెడ్డి వ్యతిరేకించారు. గద్వాలలో ఎమ్మె ల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ సరితా తిరుపతయ్య యాదవ్ వర్గాల మధ్య పొసగడం లేదు. బాన్సువాడ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్‌రెడ్డి మధ్య ఈ తరహా పరిస్థితి నెలకొంది.
ఏనుగు వర్గం నాయకులు ఏకంగా గాంధీభవన్‌కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో సింగాపురం ఇందిర ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాకను వ్యతిరేకించారు. వెనువెంటనే కడియం శ్రీహరి కూతరు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయి.
పటాన్‌చెరు ఘటనపై విచారణ కమిటీ
పటాన్‌చెరు కాంగ్రెస్‌లో జరిగిన వర్గ విభేదాలపై వాస్తవాలు తెలుసుకునేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విచారణ కమిటీ వేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఆర్‌జీ వినోద్‌రెడ్డి కమిటీలో ఉన్నారు. వీరు నియోజకవర్గంలో పర్యటించి.. అక్కడి నాయకుల మధ్య జరిగిన గొడవ, పార్టీ శ్రేణుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకొని పీసీసీకి నివేదిక ఇవ్వనున్నారు.
గాంధీభవన్‌లో పోలీసుల మోహరింపు
కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అంతర్గత పోరు నేపథ్యంలో గాంధీభవన్‌లో పోలీసుల పహారా పెంచారు. ఏ వర్గం ఎప్పుడొచ్చి ఆందోళన చేస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో పోలీసు బందోబస్తు మరింత పెంచినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ, అంతకు ముందు బీజేపీ శ్రేణులు గాంధీభవన్ ముట్టడి యత్నంతో గాంధీభవన్‌కు భద్రత మరింత పెంచారు.