- 25 నుంచి ‘కాళేశ్వరం’ విచారణ పునః ప్రారంభం
- ప్రాజెక్టుతో ముడిపడిన అందరినీ పిలిచే అవకాశం
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): ‘కాళేశ్వరం’ విచారణ సోమవారం నుంచి పునః ప్రారంభం కానున్నది. జస్టిస్ పీసీ ఘోష్ గురువారమే హైదరాబాద్‌కు చేరుకోగా విచారణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే సోమవారం నుంచి ప్రాజెక్టు నిర్మాణంలో క్షేత్రస్థాయిలో పనిచేసిన 52 మంది ఇంజినీర్లను కమిషన్ విచారించనుంది.
అనంతరం ఐఏఎస్ అధికారులను పిలుస్తారని తెలుస్తోంది. తదనంతరం కాంట్రాక్టర్లు, ప్రైవేట్ వ్యక్తులు, ఈ ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసి అఫిడవిట్లు ఇచ్చిన వారిని సైతం బహిరంగ విచారణకు పిలువనున్నారు. బ్యారేజీల పనుల్లో సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థపైనా కమిషన్ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్ అంశాలన్నీ పూర్తయ్యాక ఆర్థిక అంశాలు, నిధులకు సంబంధించి దృష్టి సారించనున్నట్టు చెబుతున్నారు.
అయితే కాళేశ్వరంపై విచారణ జరిపిన విజిలెన్స్, ఎన్డీఎస్‌ఏ తుది నివేదికలు ఇంకా కమిషన్‌కు చేరలేదని సమాచారం. కాళేశ్వరం మూడు బ్యారేజీలకు చెందిన కీలక అంశాలను సేకరించిన కమిషన్ తదుపరి విచారణలో క్షేత్రస్థాయిలో పనిచేసిన ఇంజినీర్లను ప్రతి అంశంపై ప్రశ్నించి నివేదికను సిద్ధం చేయనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు, అప్పటి సీఎం కేసీఆర్‌ను కూడా విచారణకు కమిషన్ పిలుస్తుందనే చర్చ జరుగుతోంది. ఒకవేళ హాజరు కాకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు సైతం కమిషన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.