calender_icon.png 28 December, 2024 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘోష్ కమిషన్ గడువు పెంపు!

02-11-2024 01:03:13 AM

ఈ ఏడాది చివరి వరకు పెంచే ఛాన్స్

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అక్రమాలను తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరోసారి పొడగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. గతంలో రెండుసార్లు 2 నెలల మేర గడువును పెంచిన సర్కార్, కమిషన్ విజ్ఞప్తి మేరకు మరోసారి 2 నెలలపాటు గడువు పెంచనుందని తెలుస్తోంది.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణను వందరోజుల్లో పూర్తిచేసేలా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. జూన్ 30తో ఈ గడువు ముగిసింది. విచారణ పూర్తికాకపోవడంతో 2 నెలల చొప్పున రెండుసార్లు గడువును పొడగించారు. ఈ గడువు కూడా అక్టోబర్ 31తో ముగిసింది.

ఇంకా విచారించాల్సిన అధికారులు ఎక్కువ మంది ఉండటం, ప్రాజెక్టుకు సంబంధించి చాలా అంశాలు సాంకేతికతపై ముడిపడి ఉండటంతో గడువులోపు విచారణ పూర్తి కాలేదు. మొదటిదశలో దాదాపు 60 మంది వరకు ప్రస్తుత, రిటైర్డ్ ఇంజనీర్లను విచారించారు. రెండో దశలో సుమారు 30 మంది విచారణకు హాజరయ్యారు.

పలువురు ఐఏఎస్ అధికారుల విచారణతో పాటు వారు పలు డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంది. దీంతో పాటు గుత్తేదార్లు, సబ్ కాంట్రాక్టు పనులు చేసిన వారిని కూడా విచారణకు పిలిపించే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే విచారణ కమిషన్ మరోసారి గడువు పెంచాలని ప్రభుత్వానికి ఫైల్ పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరో రెండు నెలల పాటు (ఈ ఏడాది చివరి వరకు) కమిషన్ గడువును పెంచుతారని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.