16-04-2025 12:26:25 AM
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. శేరిలిం గంపల్లి జోనల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్‌గా శ్రీనివాస్ విధులు నిర్వర్తిస్తున్నాడు. దీంతోపాటు గత కొంతకాలంగా చంద్రాయణగుట్ట సర్కిల్‌లో అర్బన్ బయోడైవర్సిటి విభాగం ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. చంద్రాయణగుట్ట సర్కిల్లో కాంట్రాక్టుకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ వద్ద శ్రీనివాస్ రూ.2లక్షల 20వేలు డిమాండ్ చేశాడు.
దీంతో తొలివిడతగా రూ. లక్ష యాభైవేలు ముట్టచెప్పాడు. మరో రూ.70వేలు లంచం ఇవ్వాల్సి ఉన్నది. రూ.70వేలు లంచం డబ్బులు తీసుకొని సదరు కాంట్రాక్టర్‌ను శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి మంగళవారం రావాలని శ్రీనివాస్ సూచించాడు. ఈ విషయమై ముందుగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సదరు కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశాడు.
దీంతో రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అక్కడ మాటు వేసి ఉన్నారు. అతని వద్ద నుండి శ్రీనివాస్ రూ.70వేలు లంచం డబ్బులు తీసుకుంటుండగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.