విలీనం కానున్న గ్రామాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లు
మున్సిపాలిటీలుగా మారనున్న ఔటర్ అవతలి గ్రామాలు
సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు
నేడు మున్సిపల్ శాఖకు నివేదిక.. స్థానిక సంస్థల ఎన్నికలలోపు అధికారిక ప్రకటన
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 31 (విజయక్రాంతి) : గ్రేటర్ హైదరాబాద్ విశాల నగరంగా మారబోతున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిని ఓఆర్‌ఆర్ వరకు విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. ఔటర్ లోపల ఉన్న గ్రామాలను, మున్సిపాలిటీలను, మున్సిపల్ కార్పోరేషన్‌లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ప్రతిపాదనలు కోరుతూ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.
ఈ క్రమంలోనే గత రెండు మూడు రోజులుగా ఔటర్ లోపల ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌లకు సంబంధించిన వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన కలెక్టర్లు నేడు పురపాలక శాఖకు నివేదిక అందించనున్నారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి స్థానిక సంస్థల ఎన్నికలలోపు అధికారిక ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. గత మే నెలలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఔటర్ వరకు ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలుగా, కార్పొరేషన్‌లుగా మార్చాలని, గ్రేటర్‌ను రీజనల్ రింగ్ రోడ్డు వరకు ఐదు భాగాలుగా విభజించాలని సూచించారు. అయితే ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. అయితే అంతిమంగా ఔటర్ వరకు గ్రేటర్‌ను విస్తరించాలని ప్రభుత్వం ఇప్పటికే సూచనప్రాయంగా నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
ఔటర్ లోపల 16 గ్రామాలు
రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఔటర్ రింగు రోడ్డు విస్తరించి ఉంటుం ది. అయితే ఇప్పటికే సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు వరకు జీహెచ్‌ఎంసీ విస్తరించి ఉంది. ప్రస్తుతం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి ఔటర్ లోపల 16 గ్రా మాలు ఉన్నాయి. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని గౌరెల్లి, కుత్బుల్లాపూర్ గ్రామాలు, శంషాబాద్ మండల పరిధిలోని బహదూర్‌గూడ, చిన్న గోల్కొండ, హమీదుల్లానగర్, రషీద్‌గూడ గ్రామాలు ఉన్నాయి. అలాగే మేడ్చల్ జిల్లా పరిధిలో ఔటర్ లోపల 10 గ్రామాలున్నాయి. వీటిలో ఘట్‌కేసర్ మండ ల పరిధిలోని వెంకటాపూర్ (హామ్లెట్ విలేజ్ తేనుగూడెం), చౌదరిగూడ (హామ్లెట్ విలేజ్ మక్తా), కొర్రెముల, కాచవాని సింగారం, (హామ్లెట్ విలేజ్ ముత్వెల్లి), ప్రతాపసింగారం గ్రామాలతోపాటు కీసర మండల పరిధిలోని చేర్యాల్, గోదుమకుంట, కరీంగూడ, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి గ్రామాలున్నాయి.
విలీనం కానున్న ఏడు కార్పొరేషన్‌లు, 20 మున్సిపాలిటీలు
16 గ్రామాలతో పాటు ఔటర్ లోపల ప్రస్తుతం ఏడు మున్సిపల్ కార్పొరేషన్‌లు విస్తరించి ఉన్నాయి. ఇందులో మేడ్చల్ జిల్లాలో పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లు ఉన్నాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో బడంగ్‌పేట్, బండ్లగూడ, మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లు ఉన్నాయి. అలాగే ఔటర్ రింగు రోడ్డు లోపల 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో పెద్దంబర్‌పేట్, ఇంబ్రహీంపట్నం, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కగూడ మున్సిపాలిటీలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో పోచారం, దుండిగల్, కొంపల్లి, తూంకుంట, గుండ్లపోచంపల్లి, ఘట్‌కేసర్, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలో బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిని కూడా ప్రభుత్వం మరో ఆరు నెలలోపు విలీనం చేయనుంది.
విశాలనగరంగా గ్రేటర్ హైదరాబాద్
హైదరాబాద్ నగరం మెడలో హారంలాగ విస్తరించి ఔటర్ లోపలి గ్రామాలు పట్టణాలతో పోటీ పడుతూ అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలోనే గతంలో కేసీఆర్ ప్రభుత్వం 2020లో మేడ్చల్ జిల్లాలో నాలుగు కార్పొరేషన్లను, ఏడు మున్సిపాలిటీలను, రంగారెడ్డి జిల్లా పరిధిలో 13 మున్సిపాలిటీలతో పాటు 3 కార్పొరేషన్లను, సంగారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఔటర్ లోపల ఉన్న గ్రామాలతో పాటు మున్సిపాలిటీలను, మున్సిపల్ కార్పొరేషన్‌లను కూడా జీహెచ్‌ఎంసీలో విలీనం చేసి గ్రేటర్ హైదరాబాద్‌ను మహా నగరంగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే ఔటర్ రింగు రోడ్డుకు దగ్గరగా ఉండి ఔటర్ అవుతల ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలుగా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే లోపు ఇందుకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.