హైదరాబాద్, (విజయక్రాంతి): తెలుగు వారి సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింభించే పండుగ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ(GHMC Mayor Gadwal Vijayalakshmi), డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి(Deputy Mayor Mothe Srilatha Reddy), కమిషనర్ ఇలంబర్తిలు(GHMC Commissioner Ilambarithi) సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల మధ్య స్నేహభావం, ఐక్యత పెంపొందించేందుకు ప్రేరణ కలిగించే పండుగ సంక్రాంతి అని పేర్కొన్నారు. మకర సంక్రాంతి రోజున సూర్యుని పూజించి, ప్రకృతి ప్రసాదాలకు కృతజ్ఞతలు తెలియ జేయడం పురాతన ఆచారాలలో ఒకటన్నారు. రైతుల కష్టానికి ప్రతిఫలంగా పంట కోతల పండుగ గా కూడా సంక్రాంతి ప్రసిద్ది చెందిందన్నారు. పండుగ వేళ ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించి, పర్యవరణానికి హానికరం కాని విధానాలను అనుసరించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డిలు సూచించారు. పండుగ సందర్భంగా పతంగులను ఎగురవేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహారించాలన్నారు. హైదరాబాద్ నగరం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడేలా నగర ప్రజలంతా సహకరించాలన్నారు.