- అధికార పక్షాన్ని నిలదీస్తూనే ఉండాలి
- నిరంతరం ప్రజల్లో తిరుగుతూ కష్టపడి పనిచేయాలి
- కార్పొరేటర్లకు ఎంపీ డా. కే లక్ష్మణ్ దిశానిర్దేశం
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): సమస్యలపై నిరంతరం పోరాడితేనే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయం సాధ్యమవుతుందని బీజేపీ ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా. కే లక్ష్మణ్.. కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. మొదటి నుంచి బీఆర్‌ఎస్ చెప్తున్నట్లుగా మేయర్ గద్వా ల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెడితే ఏం చేయాలి..
జీహెచ్‌ఎంసీ బడ్జెట్, జనరల్ బాడీ సమావేశం, రాబోయే బల్దియా ఎన్నికలకు సమా యత్తం కావడం ఎలా తదితర అంశాలపై మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన కార్పొరేటర్లతో సమీక్ష నిర్వహించారు. సమస్యలకు నిలయంగా మారిన జీహెచ్‌ఎంసీలో ఎన్నడూ లేనన్ని సమస్యలు రాజ్యమేలుతున్నాయని, దీనిపై నిరంతరం అధికార పార్టీని నిలదీస్తూనే ఉండాలని ఆ యన సూచించారు.
ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అధికార పగ్గాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని, అందరూ ఇది గుర్తుంచుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ డాంభికాలు పలుకుతున్నా అవిశ్వాసం పెట్టేంత సీన్ ఆ పార్టీకి లేదని పలువురు కార్పొరేటర్లు ఈ సమీక్షలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ అవిశ్వాసం పెడితే బీజేపీ ఎలా ముందుకు పోవాలనే అంశాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్, కాం గ్రెస్ కార్పొరేటర్లు అంతా కుమ్మక్కై రాజకీయం చేస్తున్నారని, అవిశ్వాసం పెట్టినా అంతా అధికార పార్టీ అనుకున్నట్లే జరిగే అవకాశం ఉందని చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
ఇక నగరంలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయని కార్పొరేటర్లు లక్ష్మణ్ దృష్టికి తీసుకుపోయారు. సమస్యలపై ఈ ప్రభుత్వం ఏమా త్రం పట్టించుకోవడం లేదని.. విద్యుత్ సమస్యలు భారీగా పెరిగిపోయాయని, ఆరు నెల లుగా విద్యుత్ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని, ఫలితంగా ధర్నాలు చేస్తున్నారని ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ తెలిపారు.
నగరంలో రాత్రిళ్లు ఎక్కడికిపోయినా చీకటిమయంగా మారిందని ఆయన వివరించారు. కరెంటు లైట్లు పోయినా.. మార్చే దిక్కులేకుండా పోయిందన్నారు. గోషామహల్ గ్రౌండ్స్‌లో ఉస్మానియా కొత్త ఆసుపత్రి నిర్మాణం సరైన ఆలోచన కాదనీ, దీన్ని అడ్డుకుంటామని కార్పొరేటర్లు పేర్కొన్నారు.
ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాలకు మాత్రం కనీసం టెండర్లు లేకుండానే నిధులు కేటాయిస్తున్నారని కార్పొరేటర్లు సమీక్షలో ప్రస్తావించారు. పన్నులు మేం చెల్లించాలి కానీ ఎలాంటి పన్నులు చెల్లించని ప్రాంతాలకు నిధులు కేటాయిస్తున్నారని వారు వాపోయినట్లు సమాచారం.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు తోడు దొంగలని, వీరు కలిసే జీహెచ్‌ఎంసీలో వ్యాపారం చేస్తున్నారని డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సిం హారెడ్డి సమీక్షలో తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.