హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16 (విజయక్రాంతి): నగరంలో గురువారం కురిసిన భారీ వర్షానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పలు ప్రాంతాల్లో పర్యటించారు. బంజారాహిల్స్ డివిజన్ ఉదయ్ నగర్ కాలనీలో నాలా రిటర్నింగ్ వాల్, నాలా పై కప్పు కొట్టుకుపోయిన విషయం తెలియగానే కమిషనర్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వర్షాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు సహాయక చర్యల కోసం 040 1111, 90001 13667 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
మరో 5 రోజులు వర్షం కురిసే అవకాశాలు ఉన్నందున అత్యవసరమైన సందర్భాలలో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ఈ సంద ర్భంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలతో పాటు నగరంలో రోడ్లపై నీళ్లు నిలిచిన ప్రాంతాలను తక్షణమే క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో రానున్న మూడు నుంచి ఐదు రోజుల పాటు 40 కిలో మీటర్ల వేగంతో ఈదుగాలులు వీచి తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఉరుములు, మెరుపులతో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు కమిషనర్‌కు తెలియజేశారు.