calender_icon.png 20 October, 2024 | 3:04 AM

పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం

20-10-2024 12:48:45 AM

రూ.కోట్లు దోచుకున్న దంపతులు

అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సీసీఎస్ పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 19 (విజయక్రాంతి): పెట్టుబడుల పేరుతో అమాయకులకు వల విసిరి రూ.కోట్లు దోచుకున్న ఘరానా దంపతుల గుట్టురట్టు చేశారు సీసీఎస్ పోలీసులు. వివరాలిలా ఉన్నాయి.. చిక్కడపల్లికి చెందిన హెచ్ దినేష్, జ్యోతి దంపతులకు సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలో శ్రీరామ హోల్‌సేల్ కిరాణా షాప్‌తో పాటు కీసరలో అభినవ్ ఇండస్ట్రీస్ పేరుతో పేపర్ తయారీ పరిశ్రమ ఉంది. దాంట్లో వచ్చే ఆదాయం సరిపోక అమాయకులను మోసం చేసి రూ.కోట్లు దండుకోవాలని పథకం రచించారు. ఈ క్రమంలో పలువురు అమాయకులను టార్గె ట్ చేసి, తియ్యటి మాటలతో తమ వ్యాపార సంస్థలో పెట్టుబడులు పెడితే  లాభాలతో పాటు భాగస్వామ్యం కూడా ఇస్తామని నమ్మించి భారీగా పెట్టుబడులు పెట్టించారు.

వీరి మాటలను నమ్మిన సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి పీ లక్ష్మణ్ రూ.1.10 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. పెట్టిన పెట్టుబడికి ఓ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మించారు. ఈ విషయమై లక్ష్మణ్ ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటూ బుకాయిస్తూ వస్తున్నారు. ఇలా ఆరు నెలలు గడిచినా ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకపోగా, పెట్టుబడి డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితుడు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్ పోలీసులు నిందితులు జ్యోతి, దినేష్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దంపతులపై బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మహంకాళి పోలీస్ స్టేషన్లలో కూడా గతంలో చీటింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.