- నకిలీ బంగారం కుదవపెట్టి రూ.౩౦ లక్షలు కొల్లగొట్టిన వైనం
- బ్యాంక్ సిబ్బందిపై అనుమానాలు
ఖమ్మం, నవంబర్ 24 (విజయక్రాంతి): ఖమ్మంలో ఘరానా మోసం వెలుగు చూసింది. కొందరు కేటుగాళ్లు బ్యాంకుల్లో నకిలీ బంగారం కుదవ పెట్టి రూ.లక్షలు కొల్లగొట్టినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మంలోని డీసీసీబీ బ్రాంచ్‌లతో పాటు మరికొన్ని వాణిజ్య బ్యాంకుల్లో కూడా ఈ విధమైన మోసాలు వెలుగు చూసినట్లు సమాచారం ఉంది.
సంబంధిత బ్యాంకులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు మోసం బట్ట బయలైంది. ఖమ్మంలోని డీసీసీబీ బ్రాంచీలో కొందరు నకిలీ బంగారం తాకట్టు పెట్టి దాదాపు రూ.30 లక్షలకు పైగా రుణం పొందినట్లు తెలుస్తోంది. నకిలీ బంగారం పెట్టి, రుణాలు పొందిన వ్యక్తులు తిరిగి రుణాలు చెల్లించకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో మోసం జరిగినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రతి బ్యాంకులో బంగారంపై రుణాలు ఇచ్చేటప్పుడు బంగారాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే మంజూరు చేయాలి. కానీ ఈ మోసంలో బ్యాంకు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ సిబ్బంది చేతివాటం లేకుండా ఇదంతా సాధ్యంకాదని పలువురు అంటున్నారు. సామాన్యుడికి రుణం ఇవ్వాలంటే సవా లక్ష కొర్రీలు పెట్టే బ్యాంక్ సిబ్బంది నకిలీ బంగారాన్ని ఎలా కుదవపెట్టుకున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
బీఆర్‌ఎస్ హయాంలోనే..
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే కొందరు కేటుగాళ్లు ఈ విధమైన మోసానికి పాల్పడినట్లు తెలిసింది. రెండేళ్ల క్రితం బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వ్యక్తులు రుణాలు చెల్లించకుండా పత్తా లేకుండా పోవడంతో అసలు గుట్టు రట్టయింది. ప్రధానంగా డీసీసీబీ బ్రాంచీలో ఈ రకమైన మోసాలు అధికంగా జరిగినట్లు తెలిసింది.
ఈ మధ్యనే ఖమ్మం రూరల్ బ్యాంక్ బ్రాంచ్‌లో కూడా నకలీ డాక్యుమెంట్లుతో రూ.రెండు కోట్ల మేర రుణాలు పొందిన కుంభకోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింది. ఇప్పుడు డీసీసీబీలో నకిలీ బంగారం కుంభకోణం వ్యవహారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. బ్యాంక్ అధికారులు విషయం బయటకు పొక్కకుండా అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం.