జేఎన్‌టీయూహెచ్ ఇంచార్జి వీసీగా వీ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా సీనియర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్) హైదరాబాద్ ఇంచార్జి వైస్ ఛాన్స్‌లర్‌గా వీ బాలకిష్టారెడ్డిని నియమించారు.
ఈ మేరకు శుక్రవారం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న వీ బాలకిష్టారెడ్డి తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు జేఎన్‌టీయూహెచ్ ఇంచార్జి వీసీగా కొనసాగుతారని స్పష్టంచేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా నియమితులైన ఘంటా చక్రపాణి ప్రస్తుతం అదే యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్‌మెంట్‌లో సీనియర్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.