30-04-2025 12:34:35 AM
ఫీజు బకాయిలు 7 వేల కోట్లు
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కాలేజీలను నడపడమంటే సాధారణమైన విషయమేమీ కాదు. నిర్వహణ భారంతోపాటు భవనం అద్దె, ఉద్యోగుల జీతాలు వంటి ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ఖర్చులు తడిసిమోపెడవుతాయి. ఏ ఏడాది ఫీజులు ఆ ఏడాది వస్తేనే సాఫీగా నడపొచ్చు.
కానీ మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలచేయకపోవడంతో ప్రైవేట్ జూనియర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, పారామెడికల్, బీఈడీ కాలేజీల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. తమకు రావాల్సిన ఫీజు బకాయిలు ఎప్పుడు విడుదలచేస్తారని ప్రశ్ని స్తున్నాయి. బకాయిలు చెల్లించకుండా కాలేజీలను నడపలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అధ్యాపకులకు జీతాలు, భవనాల అద్దె, నిర్వహణ భారం తడిసిమోప డవుతోందని వాపోతున్నాయి. దాదాపు రూ.7 వేల కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రావాల్సి ఉన్నదని, ఇప్పటివరకు అప్పులు చేసి కాలేజీలను నడిపామని, ఇప్పుడు ఆ అప్పు కూడా పుట్టడం లేదని యాజమాన్య సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మూడువేల కాలేజీల ఎదురుచూపు..
రాష్ట్రంలో జూనియర్, డిగ్రీ, పీజీ, ఎంబీ ఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎడ్, పారామెడికల్ తదితర కోర్సులు అందించే కాలేజీలు దాదాపు 3 వేల వరకు ఉన్నాయి. వీటన్నింటికీ 2022-23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరాలకు రూ.7 వేల కోట్లకుపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉన్నది.
వీటిలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ వంటి కాలేజీలకు రావాల్సినవి దాదాపు రూ.5 వేల కోట్లు, డిగ్రీ, పీజీ కాలేజీలకు రూ.700 నుంచి రూ.800 కోట్లు, జూనియర్, వొకేషనల్ వంటి కాలేజీలకు రూ.700 నుంచి రూ.800 కోట్లు, బీఎడ్ ఇతర కాలేజీలకు రూ.700 నుంచి రూ.800 కోట్లు వరకు రావాల్సినవి ఉంటాయి.
టోకెన్లు ఇచ్చి.. డబ్బులు మరిచారు
ఫీజ్ రీయింర్స్‌మెంట్ విధానం తీసుకొచ్చింది అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. విద్యార్థుల చదువులకయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుండటంతో ఒక్క పైసా కూడా చేతి నుంచి కాలేజీలకు కట్టే పరిస్థితిలేదు. డిగ్రీ కాలేజీలు మినహా ఇంజినీరింగ్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులందించే కొన్ని కాలేజీలు మాత్రం ఇతర ఫీజుల పేరుతో ఎంతో కొంత వసూలు చేస్తాయి.
వాటితోనే నిర్వహణ భారాన్ని కొద్దిలో కొద్దిగా తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది. కానీ, డిగ్రీ, పీజీ వంటి కాలేజీలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయొద్దని, విద్యార్థుల సర్టిఫికెట్లను ఇచ్చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుండటంతో వీరికి ఆ కొంత ఫీజు కూడా వసూలు చేసుకునే అవకాశం లేకుండాపోయింది.
దీంతో ఆర్థిక ఇబ్బందులతో కళాశాలలు కుదేలయ్యే పరిస్థితికి వచ్చాయని యాజమాన్య సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డిగ్రీ, పీజీ కాలేజీలకు రావాల్సిన బకాయిల్లో రూ.300 కోట్లకు గతంలోనే టోకెన్లు రిలీజ్ చేయగా, జూనియర్ కాలేజీలకు సుమారు రూ.400 కోట్లకు, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ కాలేజీలకు రూ.3 వేల కోట్ల వరకు టోకెన్లను ప్రభుత్వం జారీ చేసింది.
కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. డిగ్రీ, పీజీ కాలేజీల్లో దాదాపు 6 నుంచి 7 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటారు. జారీ చేసిన టోకెన్‌కు సంబంధించి రూ.300 కోట్ల నిధులు విడుదల చేస్తే తమ సమస్య కొంతమేర సమసిపోతుందని, ఈ విద్యాసంవత్సరం కాలేజీలు సాఫీగా నడుపుకో వచ్చని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
వాయిదాల మీద వాయిదా..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రేపిస్తాం.. మాపిస్తాం.. అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వస్తోంది. అయితే ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో గతేడాది డిసెంబర్ 23న అక్కడక్కడ కొన్ని జిల్లాల్లోని కాలేజీలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు విడుదల చేసింది. మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రూ.110 కోట్ల వరకు విడుదలచేసింది. ఇవి కూడా అన్ని జిల్లాలకు ఇవ్వలేదు.
ఒక్కో కాలేజీకి సుమారు రూ.15 వేల నుంచి రూ.30 లక్షల వరకు ఈ నిధులు విడుదలయ్యాయి. కొన్ని జిల్లాల్లోని కాలేజీలకైతే ఒక్క పైసా కూడా ఖాతాలో జమకాలేదు. ఒక్కో కాలేజీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు వేల నుంచి కోట్ల వరకు ఉన్నాయి. కొన్ని కాలేజీలకు రూ.5 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.
మాటలు తప్ప చేతలు లేవు
ఫీజు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వ పెద్దలను కోరితే సీఎంతో మాట్లాడుతాం.. ఇస్తామని అంటున్నారు తప్ప ఇవ్వడంలేదు. విడుతలవారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఇంత వరకూ విడుదల చేయలేదు. రెండుసార్లు నామమాత్రపు బకాయిలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. సీఎం జపాన్ పర్యటనకు వెళ్లారు.. భారత్ సమ్మిట్ ఉంది.. సీఎం వచ్చాక, సమ్మిట్ ముగిశాక మాట్లాడుతామని వాయిదాలు వేస్తూ వస్తున్నారు.
ఉస్మానియా వర్సిటీ మినహా కాకతీయ వర్సిటీ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు వర్సిటీల పరీక్షలను బాయ్‌కాట్ చేశాం. వీటి పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీల సెమిస్టర్ పరీక్షలు ఒకట్రెండు సార్లు వాయిదా పడ్డాయి. ప్రభుత్వం వెంటనే మాతో సమావేశం ఏర్పాటు చేసి రూ.7 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలి.
డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి, ప్రైవేట్ డిగ్రీ,
పీజీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు