calender_icon.png 23 October, 2024 | 4:59 PM

నిప్పు కణిక కడివెండి

17-09-2024 04:57:47 AM

  1. దొడ్డి కొమురయ్య అమరత్వం..   దొరపై తిరుగుబాటుకు సమరశంఖం 
  2. సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గ్రామం

నిజాం రాక్షస పాలనకు, దేశ్‌ముఖ్‌ల హింసాకాండకు వ్యతిరేకంగా సాగిన మహోత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో జనగామ తాలూకలోని పల్లెలు కీలకపాత్ర పోషించాయి. దేవరుప్పుల మండలంలోని కడవెండి గ్రామం పేరు వింటేనే సాయుధ పోరాటం మదిలో మెదుల్తాది. గ్రామస్తుడు దొడ్డి కొమురయ్య అమరత్వంతోనే సాధారణ పోరాటం.. సాయుధ రైతాంగ పోరాటంలా మారింది. దొరపై తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు ఆంధ్ర మహాసభ సారథ్యంలో సంఘం సభ్యుడు నల్లా నర్సింహులు నేతృత్వంలో కడవెండిలో సాయుధ పోరు రాజుకున్నది. దేశ్‌ముఖ్ రాపాక వెంకటరామచంద్రారెడ్డి, ఆయన తల్లి దేశ్‌ముఖ్ జానమ్మ పెత్తనంపై వ్యతిరేక పోరు మొదలైంది. దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి ఏలుబడిలోని 60 గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించిన లెక్కలన్నీ జానమ్మే చూసుకునేది. . ఎవరైనా ఎదురు తిరిగితే తన గడీలో గూండాలతో చిత్రహింసలు పెట్టించేది. 

ఎదురు తిరిగిన దొడ్డి మల్లయ్య..

గొర్లు, మేకల కాపరులు తమ మందలో ఒక గొర్రె లేదా మేకను ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీ. దొరసాని ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిగితే అదనంగా జీవాలను ఇవ్వాల్సిందే. ఎవరైనా ఆదేశాలు భేఖాతర్ చేస్తే వీపుపై బండ కట్టి శిక్ష విధించేది. అయితే ఈ దోపిడీపై గ్రామానికి చెందిన దొడ్డి మల్లయ్య తిరుగుబాటు మొదలుపెట్టాడు. ఈ విషయం విస్నూరు దొరకు తెలియడంతో మల్లయ్యపై దాడులు చేయించడం, పశువులను మాయం చేస్తూ ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో మల్లయ్య ముస్లింగా అవతారమెత్తి ఏకంగా నిజాం రాజును కలిసి రామచంద్రారెడ్డిపై ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేకపోవడంతో మల్లయ్య ఆంధ్ర మహాసభ నాయకులను కలిసి తనను సంఘంలో చేర్చుకోవాలని కోరాడు. తరువాత నల్లా నర్సింహులు, మచ్చ రామయ్య, మాచర్ల కొండయ్యతో పాటు మరికొందరితో కలిసి దొడ్డి మల్లయ్య ఆంధ్ర మహాసభలో చేరారు. దీంతో దొరసాని రామచంద్రారెడ్డి, సంఘం నాయకులపై కోపం పెంచుకుని కీలక వ్యక్తులను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. 

తుపాకీ తూటాకు బలి..

ఓ రోజు 40 మంది గూండాలను విస్నూరు దొర కడవెండికి పంపించాడు. గూండాలు సంఘం నాయకుల ఇండ్లపైకి దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న ఆంధ్ర మహాసభ నాయకులు ప్రజలను వెంట పెట్టుకుని అక్కడికి బయల్దేరారు. ఎడమరెడ్డి మోహన్‌రెడ్డి సుమారు వంద మందిని వెంటేసుకుని వస్తున్నారు. ఇందులో దొడ్డి మల్లయ్య కూడా ఉన్నారు. గూండాలను ఎదురించేందుకు వస్తూ సంఘం నాయకులకు ప్రజలు మరింతగా తోడవుతున్నారు. అప్పుడే గొర్లు కాసి ఇంటికి వచ్చిన మల్లయ్య తమ్ముడు దొడ్డి కొమురయ్యకు విషయం తెలియడంతో వెంటనే ఆ గుంపులోకి వచ్చాడు. అప్పటికి 18 ఏళ్ల వయస్సులో ఉన్న కొమురయ్య తీవ్ర ఆవేశంతో గూండాలను ఎదురించేందుకు ముందు వరుసలో అడగులు వేస్తూ వస్తున్నాడు. దొరసాని గడీ వద్దకు ప్రజలు సమీపించగానే గూండాలు కాల్పులు మొదలుపెట్టారు. కాల్పుల్లో దొడ్డి మల్లయ్య రెండు కాళ్లకు తూటాలు తగిలాయి. కుప్పకూలుతున్న ఆయన్ను పట్టుకునేందుకు దొడ్డి కొమురయ్య యత్నిస్తుండగా ఆయన పొట్టలోకి తూటా దూసుకొచ్చింది. కొమురయ్య ఆంధ్ర మహాసభకు జై.. అంటూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కొమురయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నాటి ప్రభుత్వం జనగామకు తరలించింది. ఆ తరువాత కొమురయ్య మృతదేహాన్ని కడవెండికి తీసుకురానీయలేదు. దీంతో జనగామలోనే అంత్యక్రియలు జరిగాయి. దొడ్డి కొమురయ్య వీర మరణంతో రైతాంగ పోరాటం సాయుధ పోరాటంగా రూపాంతరం చెందింది. కాల్పుల్లో కొమురయ్య అమరుడయ్యాడన్న విషయం దావాలనంలా వ్యాపించింది. 

భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం జరిగిన పోరాటమది. దేశ్‌ముఖ్ ఆగడాలు, దొరసాని అరాచకత్వానికి సమాధి కట్టిన గ్రామమది.. దండం పెట్టే చేతులే గుత్పలందుకొని రణన్నినాదం మోగించిన పోరుగడ్డ అది. ఆంధ్రా మహాసభ పేరుతో సంఘటితమైన ప్రజానీకం తూటాలకు ఎదురొడ్డి సాయుధ సమర శంఖం పూరించిన ‘కడవెండి’ అది. నాటి సాయుధా పోరాటంలో జనగామ తాలూకాలోని ఈ గ్రామం పోషించిన ముఖ్యపాత్రపై ‘విజయక్రాంతి’ ప్రత్యేక కథనం.

 జనగామ, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి)

మా అన్నను కాల్చి చంపిండ్రు..

మా నాన్న దొడ్డి మల్లయ్య దొరసాని అరాచకత్వానికి ఎదురు తిరిగినందుకు ఊళ్లో ఉండొద్దని విస్నూరు దొర ఆదేశించిండు. గొర్లు, మేకలు మేపొద్దని హుకుం జారీ చేసిండు. ఓ రోజు మా అన్న ఊరు శివారులో గొర్రెలు మేపుతున్న విషయం దొరసాని జానమ్మకు తెలిసింది. వెంటనే మా అన్నతో పాటు మరో వ్యక్తిని తీసుకొచ్చి చింతచెట్టుకు కట్టేసింది. అంద రు చూస్తుండగానే తుపాకీతో కాల్చి ఇద్దరిని చంపే సింది. జానమ్మ ఇలా ఎంతోమందిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపేసింది. 

దొడ్డి భిక్షపతి, కడవెండి

దొర కచ్చెరం చప్పుడు వింటేనే దడ పుట్టేది..

దొడ్డి కొమురయ్యను కాల్చి చంపినప్పుడు నేను మూడేళ్ల పోరన్ని. మా ఊర్లోకి అప్పుడప్పుడు విస్నూరు దొర రామచంద్రారెడ్డి వస్తుండే వాడు. ఆయన వస్తున్నపుడు కచ్చెరం చప్పుడు వినపపడేది. దొర వస్తుండంటే ఇంటి ముందు ఎవరూ కనిపించొద్దు. కర్మ కాలి ఎవరైనా తారసపడితే గడీకి తోలుకపోయి వీపు మీద రాయి ఎక్కించి చింతబరికతో కొట్టేటోళ్లు. అందుకే దొర ఊర్లోకి వస్తుండంటే ఇండ్లళ్లకు పోయి దాసుకునేటోళ్లం.     

చిగుళ్ల ఐలయ్య, కడవెండి