09-03-2025 12:00:00 AM
చేపలు తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల చేపలకు సంబంధించి మరో ఆరోగ్య ప్రయోజనం ఒకటి బయటపడింది. ఒమేగా కొవ్వు ఆమ్లాలు దండిగా ఉండే సాల్మన్, సార్డైన్స్ వంటి చేపలు మొటిమలు త్వరగా తగ్గటానికి తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. స్వల్పంగా, ఒక మాదిరిగా మొటిమలు గలవారిని పరిశోధకులు విశ్లేషించగా వీరిలో 98శాతం మందిలో ఒమేగా కొవ్వు ఆమ్లాల మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు తేలింది.
ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఒంట్లో వాపు ప్రక్రియను తగ్గిస్తాయి, చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఇవి వాపు ప్రక్రియను ప్రేరేపించే రసాయనాలను నిరోధించటం ద్వారా మొటిమలు తగ్గేలా చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కానీ కొందరు నిపుణులు దీనిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి చర్మ ఆరోగ్యానికివి బాగా ఉపయోగపడతాయి.