28-02-2025 07:40:45 PM
మునుగోడు (విజయక్రాంతి): జర్నలిస్టులకు ప్రయోజనం చేకూర్చే అక్రిడేషన్ కార్డుల జారీలో కోతలు విధించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అవసరమైతే రోడ్డు ఎక్కి అయినా జర్నలిస్టుల హక్కులకు భంగం కలగకుండా ప్రత్యక్ష పోరాటాలకు టియుడబ్ల్యూజే హెచ్ -143 యూనియన్ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షులు గుండగోని శంకర్ గౌడ్ అన్నారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గం జర్నలిస్టుల విస్తృతస్థాయి సమావేశం టీయూడబ్ల్యూజే హెచ్-143 ఆధ్వర్యంలో గట్టుప్పల్ లోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. టీయూడబ్ల్యూజే ట్రేడ్ యూనియన్ కార్మిక సంఘం ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం, అనుకూలం కాదని, ఏ ప్రభుత్వం ఉన్నా జర్నలిస్టుల హక్కులకు భంగం కలగకుండా, వారి సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.
తెలంగాణలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వంతో జర్నలిస్టులకు అవసరమైన అనేక హక్కులను సాధించుకోవడం జరిగిందని, జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధిని సమకూర్చుకొని కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచి ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలు సహాయం అందించడంతో పాటు, వారి పిల్లల విద్యాభివృద్ధి కోసం కృషి చేయడం జరిగిందని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులందరికీ అండగా నిలిచిన చరిత్ర టీయూడబ్ల్యూజే హెచ్ -143కి దక్కుతుందని గుండగోని జయశంకర్ గౌడ్ అన్నారు. జర్నలిస్టుల యూనియన్ ను పటిష్టవంతం చేయడానికి మండల స్థాయి నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తే వారం రోజుల్లోగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి యూనియన్ గుర్తింపు కార్డులు జారీ చేస్తామని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, నాంపల్లి, మరిగూడెం, గట్టుప్పల్, మునుగోడు, మండల కమిటీలను నూతన కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే కమిటీలలో చోటు కల్పించాలని అన్నారు. జర్నలిస్టుల విస్తృతస్థాయి సమావేశానికి ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్ అవార్ భాస్కర్ కార్యక్రమానికి హాజరై జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్ గాలెంక గురుపాదం మాట్లాడుతూ... జర్నలిస్టులకు పైసా ఆదాయం లేకున్నా ఈర్ష స్వభావంతో కలిసికట్టుగా ఉండడం లేదని, ఐక్యత లోపిస్తే జర్నలిస్టుల ఉనికి ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు పోలగోని లక్ష్మీకాంత్ గౌడ్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ టీయూడబ్ల్యూజే -143 నూతన కమిటీకి అధ్యక్షులుగా బొడ్డుపల్లి సతీష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కోడి రాములును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా కామిశెట్టి యాదయ్యను ఎన్నుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి కమిటీని ప్రకటిస్తామని నూతన అధ్యక్ష కార్యదర్శులు బొడ్డుపల్లి సతీష్, కోడి రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ ఎం గాలయ్య, శ్రీశైలం, రామస్వామి, జి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.