- రేపు సింగూరు ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం
- సీతారామ టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలి
- ప్రాజెక్టులు గడువులోగా పూర్తిచేసేందుకు యత్నంచాలి
- అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- డిసెంబర్ మొదటివారంలో నల్లగొండలో రేవంత్ పర్యటన!
హైదరాబాద్, నవంబర్ 25 (విజయ క్రాంతి): రాష్ట్రంలో ప్రాధాన్యం ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆలస్యాలను నివారించి, కీలకమైన ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
పలు సాగునీటి ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మోడికుంట వాగు ప్రాజెక్టు వ్యయం అంచనాలు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ స్థితిగతులకు సంబంధించిన వివరాలు కోరారు.
భూసేకరణ సమస్యలను పరిష్కరించేందుకు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డితో కలిసి పనిచేయాలని అధికారులకు సూచించారు. నవంబర్ 27వ తేదీన సింగూరు ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా హాజరుకానున్నారని తెలిపారు.
డిసెంబర్ మొదటి వారంలో నల్గొండలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించాల్సి ఉందని, జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో వ్యవసాయ, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత గల నీటి పారుదల ప్రాజెక్టులు చాలా ప్రధానమని, వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని సూచించారు.