calender_icon.png 17 January, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీరింగ్ కాలేజీలకు చుక్కెదురు

06-09-2024 12:40:26 AM

హైదరాబాద్, సెప్టెంబర్ ౫ (విజయక్రాంతి): ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమైనందున కొత్త కోర్సులకు అనుమతివ్వాలని, సీట్ల కుదింపు అన్యాయమని, సీట్ల పెంపు వ్యవహారంపై దాఖలైన పిటిషన్లల్లో మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. దీంతో పలు ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైనట్టు అయ్యింది. ప్రస్తుతం కౌన్సెలింగ్ జరుగుతున్నందున జేఎన్టీయూ, ఏఐసీటీఈలు అనుమతించిన సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు వీలుగా మధ్యంతర ఉత్తర్వుల జారీకి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి నిరాకరించారు.

కొత్త కోర్సులకు ప్రభుత్వం అనుమతి నిరాకరణ ఇతర అంశాలపై ప్రభుత్వం ఆగస్టు 24న జారీ చేసిన మెమోతోపాటు సాంకేతిక విద్యాచట్టంలోని సెక్షన్ 20ని సవాల్ చేస్తూ మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, ఎంజీఆర్, విద్యాజ్యోతి ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి కాలేజీ, అనురాగ్ ఇంజినీరింగ్ కాలేజీ, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఇతర కాలేజీలు వేర్వేరుగా 11 వ్యాజ్యాలను దాఖలు చేశాయి.

వీటి తరఫున సీనియర్ న్యాయవాదులు డీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్ నిరంజన్‌రెడ్డి ఇతరులు వాదించారు. కౌన్సెలింగ్లో తమ కాలేజీలకు అనుమతి ఇచ్చేలా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ, 2024 విద్యాసంవత్సరం ఆగస్టు 19 నుంచే మొదలైందని, మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే కౌన్సెలింగ్ ప్రక్రియపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ వాదనలను ఆమోదించిన న్యాయమూర్తి కాలేజీల మధ్యంతర పిటిషన్లను కొట్టివేశారు.