calender_icon.png 30 September, 2024 | 1:04 PM

మన్‌కీబాత్‌తో స్ఫూర్తి పొందా

30-09-2024 12:00:00 AM

కార్యక్రమానికి పదేళ్లు పూర్తి

114వ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ మోదీ భావోద్వేగం

పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్న ప్రధాని

శ్రోతలతోనే కార్యక్రమం విజయవంతమైందని స్పష్టం

పండగ సీజన్‌లో స్వదేశీ ఉత్పత్తులే కొనుగోలు చేయాలని సూచన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ రేడియాలో కార్యక్రమానికి పదేళ్లు పూర్తయిన సం దర్భంగా ప్రధాని నరేంద్రమోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం 114వ ఎపిసోడ్‌లో మోదీ మాట్లాడుతూ.. ఈ ఎపిసోడ్ తనను పాత జ్ఞాపకాలతో చుట్టుముడుతోందన్నారు.

పదేళ్ల క్రితం 2014లో అక్టోబర్ 3న విజయదశమి రోజు ఈ కార్యక్రమం పురుడు పోసు కుందని గుర్తుచేశారు. ఈ పదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయని, వాటిని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. దేశంలోని విభిన్న ప్రదేశాలకు చెందిన ప్రజల ప్రయత్నాలు, స్ఫూర్తిదాయకమైన కథనాలను ఈ కార్యక్రమం చూపిస్తుందన్నారు.

ప్రజల సామూహిక శక్తిని ప్రదర్శించే ప్రత్యేకమైన ప్లాట్‌ఫామ్‌గా మన్‌కీబాత్ రూపొందిందన్నారు. ఈ కార్యక్రమంలో తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు ప్రధాని కృతజ్ఞతలు చెప్పారు.  

శ్రోతలే రూపశిల్పులు

మన్‌కీబాత్‌తో కోట్లాది మంది శ్రోతలు సహచరులుగా మారారు. వారి నుంచి ఎంతో ఆదరణ పొందాను. వారే ఈ కార్యక్రమానికి నిజమై రూపశిల్పులు. సాధారణంగా మసాలా లేని కంటెంట్‌ను ప్రజలు పట్టించుకోరనే అభిప్రాయాన్ని ఈ కార్యక్రమం మార్చేసింది. జనం స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు, ప్రోత్సాహక కథనాలను ఇష్టపడుతారు.

కేవలం వర్షపు నీటినే తాగే చకోర పక్షి లాగా మన్‌కీబాత్ శ్రోతలు దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా విన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నేను దేశంలోని నలుమూలల నుంచి సమాచారం సేకరించగలిగాను. మన్‌కీబాత్‌తో నాకు దేవుడి దర్శనం చేసుకున్నంత ఆనందం కలుగుతుంది.

కార్యక్రమంలో వచ్చిన ఉత్తరాలు చదివినప్పుడు విజయగర్వంతో పొంగిపోతాను. దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. సమాజానికి సేవ చేయాలన్న తపన వారిలో ఉందని గ్రహించాను అని మోదీ పేర్కొన్నారు. 

స్వదేశీ ఉత్పత్తులే కొనుగోలు చేయాలి

ఈ కార్యక్రమంలో నీటి నిర్వహణ గురించి మాట్లాడిన మోదీ.. నీటి సంరక్షణ ఎంత ముఖ్య మో వర్షాకాలం సూచిస్తుందని, ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. భారత్ 20 వేల భాషలకు పుట్టినిల్లు అని, వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని సూచించారు.

తల్లి పేరిట మొక్క కార్యక్ర మంతో గుజరాత్‌లో 15 కోట్లు, యూపీలో 26 కోట్లకుపైగా మొక్కలు నాటినట్లు చెప్పారు. మేక్, క్రియేట్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలని తయారీదారులకు మోదీ పిలుపునిచ్చారు. మేకిన్ ఇండియా కార్యక్రమానికీ పదేళ్లు పూర్తయిందని, దీనిద్వారా ప్రతిరంగంలో ఎగుమతులతో పాటు ఎఫ్‌డీఐలు పెరిగాయని వెల్లడించారు. దసరా, దీపావళి పండుగ సీజన్‌లో స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని సూచించారు.