22-02-2025 12:24:25 AM
* ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోటాప్లస్ సంస్థ రూ.100 కోట్ల టోకరా
* పెట్టిన డబ్బులకు రెట్టింపు వస్తుందన్న ఆశతో పెట్టుబడి
* సంస్థ బోర్డు తిప్పేయడంతో లబోదిబోమంటున్న బాధితులు
ఖమ్మం, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ఖమ్మం కేంద్రంగా ఏర్పాటైన మెటాప్లస్ అనే ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థ రూ.100 కోట్లకు టోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్, ముంబాయిల్లో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయని చెప్పి నిర్వాహకులు నమ్మించారు. లక్ష పెట్టుబడి పెడితే కొద్దిరోజుల్లోనే 5 శాతం కమిషన్‌తో రెట్టింపు అమౌంట్ ఇస్తామని నమ్మబలికారు.
ఒక్కొక్కరి వద్ద నుంచి లక్ష నుంచి 25 లక్షల రూపాయల వరకు పెట్టుబడి రూపంలో వసూలు చేశారు. ఖమ్మం నగరానికి చెందిన గంటేల నవీన్, షేక్ నజీర్, విజయ్ మరికొంత మంది భాగస్వామ్యంతో మెటాప్లస్ అనే ఆన్‌లైన్ ట్రేడింగ్ సంస్థనను ఏర్పాటు చేశారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి పేరుతో అమాయకులను నమ్మించారు. అంతేకాకుండా గోవా, దుబాయ్ వంటి ట్రిప్‌లతో అమాయకులను బురిడీ కొట్టించారు. వీరి మాయలో అనేక మంది పడి, పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, కరీంనగర్, బెంగుళూరుకు చెందిన ఎంతోమంది ఈ నకిలీ సంస్థ బారినపడి మోసపోయారు. తాము పెట్టిన దాని కన్నా డబుల్ అమౌంట్ వస్తుండటంతో ఆశతో పెట్టుబడి పెట్టారు. తొలుత బాగానే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు అమౌంట్ రావడంతో నమ్మి చాలామంది ఆన్‌లైన్ పెట్టుబడి పెట్టారు.
అయితే తర్వాత రాను రాను అసలు కూడా రాకపోవడం, సంస్థ నిర్వాహకులు మొహం చాటేసి, కనిపించకుండా పోవడంతో మోసపోయామని భావించి, ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీసులను, సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిర్వాహకులు ఆచూకీ దొరకడం లేదు. చింతకాని మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఓ పాస్టర్ సంబంధీకులు సైతం సుమారు 60 లక్షలు దాకా మోసపోయినట్లు సమాచారం.
ఈ మోసంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన గంటేల నవీన్ అనే వ్యక్తి ఖమ్మం ముస్తాఫానగర్‌లో రియల్ ఎస్టేట్ పేరుతో దుకాణం తెరిచి, భారీగా మోసానికి తెరతీసినట్లు తెలుస్తోంది. తొలుత ఈ వ్యక్తి ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో చిరుద్యోగిగా పని చేసి, తర్వాత కొంతమంది సహకారంతో ఈ బడా మోసానికి తెరతీశాడని అంటున్నారు. ప్రస్తుతం నిర్వాహకులు దుబాయ్ ఉడాయించినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.