03-04-2025 01:37:53 AM
బీసీ తీర్మానాలను పార్లమెంట్‌లో ఆమోదిస్తే 10లక్షల మందితో సభ.. ప్రధాని మోదీకి ఘన సన్మానం
* చట్టసభల్లో మెజారిటీ లేకపోయినా ట్రిపుల్ తలాక్, 370 రద్దు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను దేశ ప్రజలపై రుద్దారు. తెలంగాణలోని అన్ని పార్టీలు సమర్థించిన బీసీల తీర్మానాలకు ఎందుకు ఆమోదించరు? పార్టీలన్నీ ఏకమై మద్దతు ప్రకటించినప్పుడు మీరెందుకు స్పందించరు? కేంద్రమంత్రి బండి సంజయ్ బీసీల కోసం ప్రాణం ఇస్తామంటున్నారు.. రిజర్వేషన్లు పెంచితే చాలు.
సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) : రిజర్వేషన్లు పెంచాలనే బలహీన వర్గాల కోరిక అసంబద్ధమైన కోరిక కాదని.. ధర్మబద్ధ్దమైన కోరిక అని, ఆ కోరిక నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం ముందుకురా వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నా రు. అలా రాకుంటే ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురవేసి తామే రిజర్వేషన్లను సాధించుకుంటామని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ రిజర్వేషన్లు ఆమోదించకపోతే గద్దె దిగాలి.. లేకుంటే గల్లీలో ఆ పార్టీ గద్దెలను కూల్చాల్సిందేనని ముఖ్యమంత్రి అన్నారు. బీసీలకు రిజర్వే షన్లు అందించే విషయంలో ప్రధాని మోదీ దిగిరావాలని లేకుంటే.. దిగిపోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో బీసీ లు చేస్తున్నది ధర్మయుద్ధమని చెప్పారు.
విద్యా, ఉద్యోగాలతో పాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను తొమ్మి దో షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ బుధ వారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన బీసీల పోరుగర్జన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
మండు టెండల్లో, గడ్డ కట్టే చలిలో దేశవ్యాప్తంగా రాహుల్‌గాంధీ చేపట్టిన జోడో యాత్ర స్ఫూర్తి.. ఆ సమయంలో ఆయన ఇచ్చిన హామీ మేరకే తాము బలహీన వర్గాలకు రిజర్వేషన్లను పెంచుతూ తీర్మానం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు రావాలన్నా.. స్థాని క సంస్థల్లో ఇప్పుడున్న రిజర్వేషన్లు కొనసాగాలన్నా జనగణనలో కులగణన జరగా ల్సిందేనని సీఎం అన్నారు.
ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జనగణనలో కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకుందని ఆయన గుర్తుచేశారు. తెలంగాణలో 2023, డిసెంబర్ 7న తాము అధికారం చేపట్టిన వంద రోజులు తిరగకముందే బలహీనవర్గాల లెక్కలు తేల్చేందుకు శాసనసభలో తీర్మా నం చేశామని, ఏడాది తిరగకముందే కుల గణన పూర్తిచేసి 2024 ఫిబ్రవరి 4న ఆ వివరాలను శాసనసభలో పెట్టామని గుర్తు చేశారు.
అందుకే ఫిబ్రవరి 4న సోషల్ జస్టిస్ డేగా ప్రకటించామన్నారు. కొలువుల కోసమే తెలంగాణ ఉద్యమం సాగిం దని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయమని గల్లీ నుంచి ఢిల్లీ వరకు యువత పోరాడితే, నాటి దుర్మార్గ పాలకుడు ఏ మాత్రం పట్టించుకోలేదని సీఎం విమర్శించారు.
బీసీల రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ వ్యతిరేకం..
బలహీనవర్గాల రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ నేతలు విధానపరంగా వ్యతిరేకులని ముఖ్యమంత్రి తెలిపారు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్‌ను నియమిస్తే.. వీపీ సింగ్ మండల్ కమిషన్ దుమ్ము దులిపి ముందుకు తెచ్చారని గుర్తు చేశారు. మండల్ కమిషన్‌పై బీజేపీ కుట్ర చేసి కమండల్ యాత్ర మొదలుపెట్టిందని, ఆ కమండల్ యాత్ర ప్రతినిధే నరేంద్ర మోదీ అని ముఖ్యమంత్రి విమర్శించారు.
ఇందిరాగాంధీ దళిత, ఆదివాసీ వర్గాలకు చెందినవారు కాకపోయినా ఆ వర్గాలకు అమ్మలా వ్యవహరించి.. రిజర్వేషన్లు, ఇళ్లు, భూస్వాముల దగ్గర ఉన్న వేల ఎకరాలు గుంజుకొని ఆ వర్గాలకు అందజేసిందని రేవంత్ రెడ్డి కొనియాడారు. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు ఉండాల్సిందేనని, అందుకే తాము తెలంగాణలో కులగణన చేపట్టి బీసీల లెక్క తేల్చామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కులగణన చేపట్టి రిజర్వేషన్ల పెంపు తీర్మానాలు చేసి దేశానికే తెలంగాణ ఓ దిక్సూచిగా నిలిచిందని సీఎం అన్నారు. తెలంగాణలో తాము రిజర్వేషన్లు పెంచితే కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వచ్చిన ఇబ్బంది ఏమిటని సీఎం ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్ సహా ఏ రాష్ర్టంలోనూ కులగణన చేపట్టలేదని సీఎం విమర్శించారు. మా రాష్ర్టంలో రిజర్వేషన్లు పెంచుకుంటామని మేం కోరితే ఎందుకు ఒప్పుకోవడం లేదో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.
హస్తినకు వచ్చాం.. ఇక రాం...
కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అయిదు ఊళ్ల కోసం కృష్ణుడు రాయబారానికి వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయిననూ పోయిరావలె హస్తినకు అనే రీతిలోనే తాము హస్తినకు వచ్చామని.. తెలంగాణలో ఆమోదించిన తీర్మానాలను పార్లమెంట్‌లో ఆమోదిస్తే 10 లక్షల మందితో సభ పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సన్మానిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మా గుండె చప్పుడు పంచుకోవాలని, మా అభిప్రాయాలు వినాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు. మాపై ఆధిపత్యం చలాయించాలనుకున్న నిజాంలకు, గడీల దొరలకు ఏమైందో తెలుసుకోవాలని ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి సూచించారు. బుక్కెడు బువ్వ పెట్టినా, మంచినీళ్లు ఇచ్చినా మర్చిపోని బలహీన వర్గాలను మీరెందుకు పట్టించుకోరని ప్రధానిని ప్రశ్నించారు.
చట్టసభల్లో మెజారిటీ లేకపోయినా ట్రిపుల్ తలాక్, 370 రద్దు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను దేశ ప్రజలపై రుద్దారని సీఎం విమర్శించారు. తెలంగాణలోని అన్ని పార్టీలు సమర్థించిన తీర్మానాలకు ఎందుకు అనుకూలంగా ఉండరని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై జంతర్‌మంతర్లో పార్టీలు ఏకమై మద్దతు ప్రకటించినప్పుడు మీరెందుకు స్పందించరని బీజేపీ నేతలను సీఎం ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీల కోసం ప్రాణం ఇస్తామంటున్నారని, ఆయన ప్రాణం తమకు వద్దు.. వందేళ్లు ఆయన జీవించాలని.. రిజర్వేషన్లు పెంచితే చాలునని సీఎం తెలిపారు. మా పిల్లల చదువులు, ఉద్యోగాలు, పదవులకు రిజర్వేషన్లు అడిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు స్పందించరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
బలహీన వర్గాలకు రిజర్వేషన్ల పెంపు అనే ధర్మమైన డిమాండ్ కోసం తాము హస్తినకు వచ్చామని.. ఇకపై ఢిల్లీకి రామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. ఒకనాడు ధర్మయుద్ధ సభ పెట్టాలని మందకృష్ణ మాదిగకు సూచించానని.. అలా చేసి ఆయన విజయం సాధించారని.. పరేడ్ గ్రౌండ్‌లో బీసీలు ధర్మయుద్ధ సభ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ తదితరులు ప్రసంగించారు. ఈ ధర్నాలో డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హన్మంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, సినీనటుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.
రియల్ హీరో ‘సీఎం రేవంత్’
ఢిల్లీ ధర్నాలో యాక్టర్ సుమన్
హైదరాబాద్, ఏప్రిల్ 2, ( విజయక్రాంతి): బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడ వస్తాయని అనుమానాలు వ్యక్తమయిన వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపించారని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు తీసుకువచ్చిన సీఎం రేవంత్ నిజంగా ‘రియల్ హీరో’ అని ప్రశంసించారు.
బుధవారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న బీసీ మహాధర్నాకు సుమన్ సంఘీభావం తెలిపారు. సుమన్ మాట్లాడుతూ.. మా బీసీలంతా రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో బీసీలు, గౌడ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని.. వారికి ఎస్టీ స్టేటస్ కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా నరేంద్ర మోదీ బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్నాలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు పాల్గొన్నారు.