calender_icon.png 8 October, 2024 | 8:23 AM

తరాలు మారినా బ్యాంక్ ఇదే!

01-09-2024 12:00:00 AM

రెండు శతాబ్దాలుగా తరాలు మారి నా ప్రతీ తరంలోనూ అత్యంత విశ్వసనీయ బ్యాంక్‌గా ఎస్బీఐ గుర్తింపు పొందిందనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశం నలుమూలలా విస్తరించి  భారత బ్యాంకింగ్ వ్యవస్థకు తలమానికంగా నిలిచిన ఎస్బీఐ భారతీయ బహుళజాతి సంస్థగా ఫార్చూన్ 500కంపెనీగా విశ్వవ్యాప్తమయ్యింది. అన్ని బ్యాంకింగ్ సాధనాల్లోనూ ఖాతాదారుల ఆదరణ పొందిన ఎస్బీఐ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం నుంచి చిన్న పరిశ్రమల వరకూ వివిధ రంగాలకు ఆర్థిక మద్దతునిస్తూ ముందుకు సాగుతున్నది. 

50 కోట్ల ఖాతాదారులు.. రూ.61 లక్షల కోట్ల ఆస్తులు

దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ అయిన ఎస్బీఐ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.61 లక్షల కోట్లు దాటాయి. 50 కోట్లకుపైగా ఖాతాదారులకు సేవలందిస్తున్నది. దేశవ్యాప్తంగా 22,500కుపైగా ఎస్బీఐ శాఖలు పనిచేస్తున్నాయి. 63,580 ఏటీఎంలను నెలకొల్పింది. 

విస్తరించిన వ్యాపారాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్సిడరీలు..ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ కార్డ్ తదితరాల ద్వారా వివిధ బ్యాంకింగ్‌యేతర వ్యాపారాల్లోనూ వేళ్లూనుకున్నది. అంతర్జాతీయంగా ఉనికిని పెంచుకుని 29 దేశాల్లో 241 కార్యాలయాల ద్వారా కార్యకలాపాల్ని నిర్వహిస్తున్నది. 2024 జూలై 1న 69వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న ఎస్బీఐ పలు సామాజిక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహించింది. 

మార్కెట్ విలువ రూ.7.27 లక్షల కోట్లు

స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ భాగమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత మార్కెట్ విలువ రూ.7.27 లక్షల కోట్లు. దేశంలోని అత్యధిక మార్కెట్ విలువ కలిగిన సంస్థల్లో ఏడో స్థానంలో ఉన్న ఎస్బీఐ ప్రపంచంలో 17వ ర్యాంక్‌లో ఉన్నది. 

ప్రధాన మైలురాళ్లు

  1. 1998లో పేమెంట్ కార్డ్స్ వ్యాపారాన్ని ఎస్బీఐ ప్రారంభించింది.
  2. 2001లో జీవిత బీమా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది విదేశాలకు వెళ్లే భారతీయుల కోసం ఎస్బీఐ ఇంటర్నేషనల్ కార్డ్, ఎస్బీఐ గ్లోబల్ కార్డ్‌లను ప్రవేశపెట్టింది. 
  3. 2010కల్లా ఎస్బీఐ డెబిట్‌కార్డ్ బేస్ 7 కోట్లకు చేరుకున్నది. అదే ఏడాది డెబిట్ కార్డ్‌కు చిప్‌ను జతచేసింది. పిన్ ఆధారిత ప్లాటినం డెబిట్ కార్డును కూడా అప్పుడే విడుదల చేసింది.
  4. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ)తో కలిసి 2015లో రూపే ప్లాటినం డెబిట్ కార్డును ప్రవేశపెట్టింది.

ఆధునిక బ్యాంకింగ్ బాటలో...

ఫైనాన్షియల్ రంగంలో వచ్చిన వినూత్న మార్పులకు అనుగుణంగా ఎస్బీఐ తనను తాను మలుచుకున్నది. ఆధునిక బ్యాంకింగ్ సర్వీసుల్ని అందించేదిశగా డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ పై దృష్టిపెట్టి యువ ఖాతాదారుల్ని ఆకర్షించగలుగుతున్నది. 

2017లో తన అసోసియేట్ బ్యాంక్‌లైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెంకోర్ విలీనపర్చుకోవడం ద్వారా ప్రపంచంలో భారీ బ్యాంక్‌ల్లో ఒకటిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆవతరించింది. 2.45 లక్షల మంది ఉద్యోగులతో ప్రపంచంలో అత్యధిక సిబ్బంది కలిగిన బ్యాంక్‌గా ఎస్బీఐ నిలిచింది. ఎస్బీఐ ఉద్యోగుల్లో 27 శాతం మంది మహిళలు ఉన్నారు. అరుంధతి భట్టాచార్య తొలి ఎస్బీఐ చైర్మన్‌గా 2013లో నియమితులయ్యారు. తెలంగాణలోని గద్వాలకు చెందిన శ్రీనివాసులు శెట్టి ఎస్బీఐ కొత్త ఛైర్మన్‌గా ఈ వారమే  బాధ్యతలు స్వీకరించారు.